ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్లో అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడన్తో జూన్ 22న మోదీ సమావేశమవుతారని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తెలిపింది. ఈ అధికారిక పర్యటనకు సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సమావేశంలో ఇరువురి మధ్య కీలక అంశాలపై చర్చ జరగనుందని వెల్లడించింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీకి.. బైడెన్ అధికారికంగా డిన్నర్ పార్టీ ఇస్తారని వైట్ హౌస్ వివరించింది.
“సాంకేతికత రంగంలో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం సహా రక్షణ, శుద్ధ ఇంధనం, అంతరిక్షం రంగాలపై ఇద్దరు నేతలు చర్చలు జరపనున్నారు. ఇరుదేశ ప్రజల మధ్య సంబంధాలతో పాటు విద్యారంగంలో భాగస్వామ్యంపై చర్చిస్తారు. ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన వాతావరణ మార్పులు, ఆరోగ్య భద్రత అంశాలపై సమాలోచనలు జరుపుతారు. స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్ అంశంలో ఇరుదేశాల ఉమ్మడి లక్ష్యాలను మోదీ పర్యటన మరింత పటిష్ఠం చేస్తుంది.” అని శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్ పియర్ తెలిపారు.