రష్యా సైన్యంపై వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రిగోజిన్పై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిగోజిన్ నిర్ణయాన్ని ద్రోహంగా అభివర్ణించారు. వాగ్నెర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటుదారులు.. కీలకమైన దక్షిణ నగరంలో పౌర, సైనిక పాలక సంస్థలను నిరోధించిందని అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ఈ విషయంపై సైనిక కమాండర్లతో మాట్లాడినట్లు వెల్లడించారు. హెచ్చరికల ద్వారా తీవ్రమైన నేరపూరిత సాహసానికి ఒడిగట్టారని వాగ్నర్ ప్రైవేటు సైన్యాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సాయుధ తిరుగుబాటు తీవ్రమైన నేరంగా పుతిన్ అభివర్ణించారు.
సైనిక తిరుగుబాటుకు ఉసిగొల్పిన వారిని అడ్డుకుంటామని… ఇలాంటి సమయంలో ఐక్యత కావాలని, బాధ్యత అవసరమని పుతిన్ వ్యాఖ్యానించారు. కావాలని దేశద్రోహ పంథాలో నడిచేవారిని, ఉగ్రదాడులకు పాల్పడుతున్నవారిని తప్పకుండా శిక్షిస్తామని తెలిపారు. వాగ్నర్ గ్రూప్ నుంచి రష్యా ప్రజలను.. తమ దేశాన్ని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని.. తమ దేశాన్ని తప్పకుండా కాపాడుకుంటామని పుతిన్ తేల్చి చెప్పారు.