బ్రిటన్‌లో ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని అణచివేస్తా : రిషి సునాక్

-

అమలులో ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేయడం ద్వారా.. బ్రిటన్‌కు తీవ్రమైన ముప్పుగా పరిణమించిన ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని అణచివేస్తానని ప్రధానమంత్రి అభ్యర్థి రిషి సునాక్‌ బుధవారం ప్రతిజ్ఞ చేశారు. ప్రధాని రేసులో తన ప్రత్యర్థి అయిన విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌తో పోటీ పడుతున్న బ్రిటిష్‌ – ఇండియన్‌ రిషి (42) బ్రిటన్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంస్థలను సమూలంగా పెకలిస్తానని అన్నారు. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల ఓట్ల కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘రెడీ ఫర్‌ రిషి’ ప్రచార బృందం తీవ్రవాదంపై తమ పోరుకు సంబంధించిన ప్రణాళికలను విడుదల చేసింది. కాగా, బుధవారం విడుదలైన ఓ తాజా సర్వే ప్రకారం లిజ్‌ ట్రస్‌ మళ్లీ విస్తృత ఆధిక్యంలోకి వచ్చారు. ‘ది టైమ్స్‌’ నిర్వహించిన యూగవ్‌ పోల్‌ సర్వేలో ఆమె 38 పాయింట్లు మెరుగుపరచుకొని 69 శాతం ఆధిక్యతతో ఉన్నారు. రిషి సునాక్‌కు 31 శాతం మద్దతు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.

‘బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి జరుగుతున్న ఎన్నికలో సైబర్‌ హ్యాకర్లు చొరబడ్డారని, వీరు సభ్యుల బ్యాలెట్లను తారుమారు చేసే ప్రమాదం ఉందని దేశ గూఢచారుల నుంచి అందిన కీలక సమాచారంతో ఓటింగు ప్రక్రియలో జాప్యం అనివార్యంగా కనిపిస్తోంది. ‘ది డైలీ టెలిగ్రాఫ్‌’ ఈ సమాచారంతో కథనాన్ని ప్రచురించింది.‘జాతీయ సైబర్‌ సెక్యూరిటీ కేంద్రంతో సంప్రదింపులు జరిపాం. బ్యాలెట్‌ ప్రక్రియలో మార్పులు చేసి, మరింత భద్రత పెంచాలని నిర్ణయించాం. అర్హులైన సభ్యులు ఈ వారం నుంచే బ్యాలెట్‌ కవర్లు తీసుకోవచ్చు’ అని కన్జర్వేటివ్‌ పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news