రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సీనియర్ జనరల్ ఇవాన్ పొపోవ్ను పదవి నుంచి తొలగించారు. షోయిగు ద్రోహంపై సీనియర్ జనరల్ ఇవాన్ కొన్నాళ్ల క్రితం విమర్శలు గుప్పించారు. షోయిగు నాయకత్వంలోని రక్షణ శాఖ సైనికులకు ఆయుధాలు, మందుగుండు ఇవ్వడం లేదనడమే అతడు ఆరోపించారు. దీంతో ఇవాన్‌ను తొలగిస్తూ షోయిగు ఆదేశాలు జారీ చేశారు.
ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న అత్యంత సీనియర్ కమాండర్లలో ఇవాన్ ఒకరు. ఆయన టీమ్ అణుకేంద్రం ఉన్న జపొరిజియాలో పోరాడిన సమయంలో ఉక్రెయిన్ భీకరంగా శతఘ్ని దాడులు చేసింది. అప్పట్లో ప్రతిదాడులకు ఇవాన్ బృందం వద్ద మందుగుండు కొరవడటమే గాక.. ప్రత్యర్థి శతఘ్నులపై నిఘా వేసేందుకు వీలైన కేంద్రాలు కూడా లేవు. దీనివల్ల అతడి బృందంలో భారీ సంఖ్యలో సైనికులు మృతి చెందారు. ఈ విషయాలను అతడు రష్యాలో అత్యున్నత సైనిక నాయకత్వం వద్ద ముక్కుసూటిగా ప్రస్తావించడంతో.. క్రెమ్లిన్‌ను విమర్శించాడంటూ.. రక్షణ మంత్రి సెర్గీ షోయిగు అతడిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.