ఆప్ఘనిస్థాన్‌ను ఆక్రమించినప్పుడు వేద వాక్యాలు పలికిన తాలిబన్లు తరువాత మాట తప్పారు. ఎన్నో అరాచకాలకు, అకృత్యాలకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అందరినీ వెదికి మరీ కాల్చి చంపేస్తున్నారు. తాజాగా ఓ గర్భిణీని వారు అత్యంత కిరాతకంగా హతమార్చారు.
ఆప్ఘన్ ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసిన బాను నెగర్ గర్భవతి. ఆమె ఘోర్ ప్రావిన్స్ లోని ఫిరోజ్‌కో లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె గురించిన వివరాలను తెలుసుకున్న తాలిబన్లను ఆమెను చంపేందుకు ఆమె ఇంటికి చేరుకున్నారు.
మొత్తం ముగ్గురు తాలిబన్లు ఆయుధాలతో వచ్చి ఆమె ఇంట్లోని కుటుంబ సభ్యులను అందరినీ తాళ్లతో బంధించారు. భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు అందరినీ తాళ్లతో కట్టేశారు. తరువాత ఆమె ముఖాన్ని చిత్రవధ చేశారు. అనంతరం ఆమెను ఆమె భర్త, పిల్లల ఎదుటే కాల్చి చంపేశారు. అత్యంత కిరాతకంగా తాలిబన్లు ప్రవర్తించారు. ఈ వివరాలను బీబీసీ వెల్లడించింది.
అయితే ఈ సంఘటనపై తాలిబన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. తాలిబన్లు అలా చేయరని, ఆమెను చంపింది తాలిబన్లు కాదని, తమకు, ఆమె హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. గత ప్రభుత్వంలో పనిచేసిని వారిని దయతో విడిచిపెడుతున్నట్లు గతంలోనే ప్రకటించామని, ఆ మాటకు కట్టుబడే ఉన్నామని తెలిపాడు. అయితే ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.