కరోనా మహమ్మారి నుంచి తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భారీ ప్యాకేజీలకు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కొవిడ్ -19 వ్యాక్సిన్‌ను అమెరికన్లందరికీ జనవరి నాటికి ఉచితంగా అందించే ప్రణాళికను ట్రంప్ పరిపాలన విభాగం విడుదల చేసింది. వ్యాక్సిన్ పంపిణీ వ్యూహాన్ని వివరిస్తూ అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం, యుఎస్ రక్షణ శాఖ సంయుక్తంగా రెండు పత్రాలను విడుదల చేశాయి.
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి ట్రంప్ ఇప్పటి నుంచే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ వ్యూహాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 6,828,301 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 201,348 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 4,119,158మంది కరోనా నుంచి కోలుకున్నారు.