పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు రహస్యంగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అరెస్టై విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో తన వ్యక్తిగత న్యాయవాదిగా ఉన్న మైఖేల్ కొహెన్.. తనపై అసత్య ప్రచారాలు చేసి కాంట్రాక్టు ఉల్లంఘనకు పాల్పడ్డాడని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తనకు నష్టాన్ని కలిగించినందుకు దాదాపు రూ. 4 వేల కోట్ల రుపాయలు చెల్లించాలని కోరుతూ ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో దావా వేశారు.
స్టార్మీ డేనియల్స్‌తో డొనాల్డ్ ట్రంప్ అనైతిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులో మైఖేల్ కొహెన్ కీలక సాక్షిగా ఉన్నారు. అయితే, ట్రంప్‌నకు కొహెన్ వ్యక్తిగత న్యాయవాదిగా ఉన్న సమయంలో జరిగిన అటార్నీ-క్లైంట్ సంభాషణలను రహస్యంగా ఉంచడంలో కొహెన్ విఫలమయ్యాడని ట్రంప్ ఆరోపించారు. పలు పుస్తకాలు, పాడ్‌కాస్ట్ సిరీస్, ఇతర మీడియాలో సంస్థల్లో తన గురించి బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసి కొహెన్ కాంట్రాక్టు ఉల్లంఘనకు పాల్పడ్డారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.