ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య పోరు రోజురోజుకు ఉద్ధృతంగా మారుతోంది. గాజాపై ఇజ్రాయెల్ వైమానికి, భూతల దాడులతో విరుచుకుపడుతోంది. మరోవైపు హమాస్ ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతోంది. ఇరు దేశాల మధ్య సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇటీవలే బందీల వీడియోను రిలీజ్ చేసి హమాస్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది.
ఈ నేపథ్యంలో హమాస్ అపహరించిన బందీల ఆచూకీ కనుగొనేందుకు అమెరికా రంగంలోకి దిగింది. గాజా గగనతలంపై అగ్రరాజ్యం తన డ్రోన్లను ఎగురవేసింది. బందీలను దాచిన ప్రదేశాలను కనిపెట్టేందుకు నిఘా డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు బందీలను దాచిన ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్‌ను సేకరిస్తున్నట్లు సమాచారం. దాదాపు వారం క్రితం నుంచే ఇవి గాలింపు చేపట్టాయని ఇజ్రాయెల్ తెలిపింది.
ఇజ్రాయెల్‌కు తమ దేశాన్ని రక్షించుకునే హక్కుందని చెబుతూనే గాజాకు మానవతా సాయం చేయాలని అమెరికా సూచిస్తోంది. తనను తాను రక్షించుకొనేందుకు ఇజ్రాయెల్ చేసే ప్రయత్నాలకు అమెరికా మద్దతు ఉంటుందని చెప్పారు. అలాగే గాజాకు మానవతా సాయం అందించేదుకు ముందుకు వస్తామని తెలిపారు.