బండారు పని అయిపోయిందా…?

-

బండారు సత్యనారాయణ మూర్తి… టీడీపీ సీనియర్ నేతగా ఈయనకు పేరు. కానీ… అంతకు మించి ఈయనకు మరింత పాపులారిటీ వచ్చింది. అందుకు ప్రధాన కారణం… మంత్రి రోజాపై అసభ్యకరమైన కామెంట్లు చేయడమే. మంత్రి రోజాను కించపరిచేలా కామెంట్లు చేశాడంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. కానీ బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు సినీ హీరోయిన్‌లు రోజాకు మద్దతుగా డిమాండ్ చేశారు కూడా. దీంతో బండారు పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.

Bandaru Satyanarayana

అయితే తాజాగా బండారు సత్యనారాయణ మూర్తి ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి పెద్ద కారణమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంకా చెప్పాలంటే ఇదో పొలిటికల్ గేమ్ ప్లాన్ అని కూడా అంటున్నారు. ఏపీలో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తాజాగా చంద్రబాబు అరెస్టు తర్వాత పొత్తు విషయాన్ని పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో జనసేనకు 35 నుంచి 40 నియోజకవర్గాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ నియోజకవర్గాల జాబితా ఇప్పటి వరకు బయటకి రాలేదు.

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపైనే పవన్ కల్యాణ్ ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల విశాఖ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు… జనసేనలో చేరారు. ఆయన గతంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో మరోసారి పెందుర్తి నుంచి పోటీకి సై అంటున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించిన పంచకర్లను కాదని… అదిప్ రాజుకు టికెట్ ఇచ్చారు జగన్. ఆ తర్వాత అసంతృప్తితో ఉన్న పంచకర్ల రమేష్ బాబును పార్టీ అధ్యక్షుడిని చేశారు జగన్.

నాలుగున్నరేళ్లు బాగానే ఉన్న పంచకర్ల.. ఇటీవల జనసేనలో చేరారు. దీంతో పొత్తులో భాగంగా పెందుర్తి సీటు జనసేనకు కేటాయిస్తారనే మాట బలంగా వినిపిస్తోంది. దీంతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా అయ్యింది. తనకు ఇప్పటికి పాపులారిటీ ఉందని… తాము రాష్ట్ర స్థాయి నేత అని చెప్పుకునేందుకు… ఇలా రోజాను బండారు సత్యనారాయణ మూర్తి టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్ని వివాదాలుంటే.. అంత పాపులారిటీ వస్తుందని… ఎన్ని కేసులుంటే అన్ని పదవులు వస్తాయని ఇప్పటికే లోకేష్ తన పార్టీ నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ కేసులతో పాపులారిటీ సాధించి… పెందుర్తి టికెట్ పొందాలనేది బండారు గేమ్ ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news