సైనిక తిరుగుబాటు నేపథ్యంలో మయన్మార్ పార్లమెంటు వెలుపల ఒక మహిళ ఏరోబిక్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. వీడియోలో, ఒక ఉపాధ్యాయురాలు ఏరోబిక్స్ చేసినట్టు కనపడుతుంది. ఖింగ్ హ్నిన్ వైగా గుర్తించబడిన మహిళ… యూనియన్ కాంప్లెక్స్ ముందు వ్యాయామం చేస్తూ కనపడింది. గత కొంత కాలంగా మయన్మార్ లో తిరుగుబాటు జరుగుతుంది.
నలుపు మరియు నియాన్ ఆకుపచ్చ అథ్లెటిజర్ ధరించి, ఇండోనేషియా పాట “అంపున్ బ్యాంగ్ జాగో” అనే పాటలతో ఆమె ఈ డాన్స్ చేస్తుంది. మూడు నిమిషాల వీడియోను ఖింగ్ తన ఫేస్‌బుక్ పేజీలో సోమవారం పోస్ట్ చేశారు. అక్కడి నుంచి కూడా ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఒక సంవత్సరం పాటు దేశంపై నియంత్రణ సాధించినట్లు సైన్యం ప్రకటించడంతో సోమవారం మయన్మార్‌లో గందరగోళం నెలకొంది.
కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లాంగ్ ఒక సంవత్సరం పాటు దేశానికి బాధ్యత వహిస్తారని సైనిక యాజమాన్యంలోని మయావాడీ టీవీ తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ ఎన్నికలను ముందుకు సాగడానికి అనుమతించడం ఆ తర్వాత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అని ఆరోపణలు రావడం సంచలనం అయింది. ఈ తరుణంలో అక్కడి ప్రజల్లో కూడా ప్రభుత్వంపై అసహనం పెరిగింది.