తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 29 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురికి అదనపు బాధ్యతలు అప్పగించింది. కొత్తగా ఏర్పాటు చేసిన యాంటి నార్కోటిక్స్ బ్యూరో అదనపు డీజీగా సీవీ ఆనంద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర సర్కార్. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాజీవ్ రతన్‌ను, పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్యాను నియమించింది. రైల్వే అదనపు డీజీగా ఉన్న సందీప్ శాండిల్యా స్థానంలో శివధర్ రెడ్డిని నియమించింది. సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రకు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటి బ్యూరో ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుతం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డిజిగా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని లీగల్ ఆపరేషనల్ అదనపు డిజిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజయ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనిశా అదనపు డిజిగా ఉన్న శిఖాగోయల్‌ను షీ టీమ్స్, మహిళా భద్రతా విభాగం అదనపు డిజిగా బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ స్థానంలో ఉన్న స్వాతిలక్రాను టిఎస్‌ఎస్పీ అదనపు డిజిగా నియమించింది. ప్రస్తుతం టిఎస్‌ఎస్పి అదనపు డిజిగా ఉన్న అభిలాషా బిస్త్ ను పోలీసు వెల్ఫేర్, క్రీడల అదనపు డీజీగా నియమించింది.