కడియం శ్రీహరి అంటే ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. ప్రత్యర్థి పార్టీలకు గట్టి సమాధానం చెప్పగల వ్యక్తి. ఇక తెలంగాణ వచ్చాక కూడా మొదటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు మంచి సపోర్టుగా ఉన్న నేత. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన చెప్పిందే వేదం. ఎంతో మందికి టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకున్నాడు.
కానీ రెండో సారి ప్రభుత్వంలో మాత్రం ఆయనను కేసీఆర్ పక్కన పెట్టేశాడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎర్రబెల్లికి అవకాశం ఇచ్చారు. అయితే అప్పటి నుంచి అధికారిక కార్యక్రమాలన్నింటికీ కడియం దూరంగానే ఉంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో కూడా ఆయన ప్రాభవం తగ్గిపోతూ వస్తోంది. అన్నీ తానై చూసుకుంటున్నారు ఎర్రబెల్లి. ఇప్పుడు కేవలం ఎమ్మెల్సీగా మాత్రము ఉన్నాడు శ్రీహరి. అయితే మొన్న కేసీఆర్ వరంగల్ టూర్‌కు వెళ్లినప్పుడు శ్రీహరి స్వయంగా కేసీఆర్ కారు దగ్గరకు వెళ్లి పలకరించే ప్రయత్నం చేసినా కేసీఆర్ మాత్రం పట్టించుకోకుండా వెల్లిపోయారు. దీంతో ఆయనకు ఘోర అవమానం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి కూడా అనుమానమే అన్నట్టు ఉంది.