గజ్వేల్ బరిలోనే కేసీఆర్..లక్ష మెజారిటీ సాధ్యమేనా?

-

సి‌ఎం కే‌సి‌ఆర్…వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? ఆయన గజ్వేల్ బరిలో ఉండరా? లేక వేరే సీటుకు మారిపోతారా? కామారెడ్డిలో పోటీ చేస్తారా? అంటే అన్నిటికి సమాధానం తాజాగా మంత్రి హరీష్ రావు ఇచ్చేశారు. తాజాగా గజ్వేల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన హరీష్..మళ్ళీ కే‌సి‌ఆర్ గజ్వేల్ బరిలోనే పోటీచేస్తారని, ఈ సారి లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కే‌సిఆర్ పోటీ చేయకముందు గజ్వేల్ లో సరిగ్గా రోడ్లు కూడా లేవని, ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధి పథంలో ముందుకెళుతుందని అన్నారు. దీంతో కే‌సి‌ఆర్ మళ్ళీ గజ్వేల్ నుంచి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇక అక్కడ ఆయన గెలుపు విషయంలో ఎలాంటి ఢోకా లేదనే సంగతి తెలిసిందే. మరి లక్ష మెజారిటీ సాధ్యమేనా? అనేది చూడాలి. ఇంతవరకు కే‌సి‌ఆర్ లక్ష మెజారిటీ సాధించలేదు. తొలిసారి కే‌సి‌ఆర్ సిద్ధిపేట నుంచి టి‌డి‌పి తరుపున పోటీ చేసి 1983లో ఓడిపోయారు.

ఇక తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా టి‌డి‌పి నుంచి గెలిచారు. తర్వాత టి‌ఆర్‌ఎస్ పెట్టి 2001 ఉపఎన్నికలో గెలిచారు. 2004లో కూడా గెలిచారు. అప్పుడు కరీంనగర్ ఎంపీగా గెలవడంతో..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో సిద్ధిపేట ఉపఎన్నికలో హరీష్ రావు పోటీ చేసి గెలిచారు. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు. అయితే ఎంపీగా తప్ప..ఎమ్మెల్యేగా ఎప్పుడు లక్ష మెజారిటీ సాధించలేదు.

2014లో గజ్వేల్ నుంచి 19 వేలు, 2018లో 58 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే గత ఎన్నికల్లో సిద్ధిపేటలో హరీష్ లక్ష పైనే మెజారిటీతో గెలిచారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో గజ్వేల్ లో కే‌సి‌ఆర్‌కు లక్ష మెజారిటీ ఛాన్స్ ఉందా? అంటే కాంగ్రెస్, బి‌జే‌పిల అభ్యర్ధులని బట్టి అని చెప్పవచ్చు. రెండు పార్టీల్లో బలమైన అభ్యర్ధులు ఉంటే కే‌సి‌ఆర్‌కు లక్ష మెజారిటీ కష్టమే..లేదంటే సాధించే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news