ఉత్సాహం, పోరాటం, ఆరాటం అన్ని ఉన్న నేతగా గుర్తింపు పొందారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆయన తెలుగుదేశంలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకునే శైలి లో ప్రసంగాలు చేయగలగడం, అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడం, ఇలా ఆల్ రౌండర్ గా రేవంత్ పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కి ఊపు వచ్చినట్టుగా కనిపిస్తుందంటే దానికి కారణం రేవంత్ అని ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. రేవంత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు అంతా పావులు కదుపుతూ, అడుగడుగున అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నా, రేవంత్ మాత్రం లెక్కచేయకుండా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అవినీతి వ్యవహారం వెలుగులోకి తెస్తూ, క్రమక్రమంగా వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేసి రాజకీయంగా పైచేయి సాధించాలని చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఆయన త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని, కాంగ్రెస్ లో ఉండే ఛాన్సే లేదని ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ లో ఉన్న గ్రూపు రాజకీయాలు కారణంగా ముందు ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, స్వపక్షం లోని విపక్షాన్ని నిత్యం ఎదుర్కోవడం పెద్ద తలనొప్పి వ్యవహారం అని రేవంత్ ఎప్పటినుంచో అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ఇబ్బందులు పడుతుండటం, ముందు ముందు మరింత బలహీనం అయ్యే అవకాశం ఉండడంతో ఆయన సొంత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.అసలు రేవంత్ కు సొంత పార్టీ ఆలోచన రావడానికి టిడిపి అధినేత చంద్రబాబు కారణం అనే విషయం ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది.
ఆయన సలహాలు సూచనలతోనే కొత్తపార్టీ పెట్టేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారట. రేవంత్ రాజకీయంగా పైకి ఎదిగితే, తనకు బద్ధశత్రువుగా ఉన్న కెసిఆర్ ను రాజకీయంగా పతనం చేయవచ్చనే అభిప్రాయంతో బాబు రేవంత్ ను దువ్వుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ పార్టీ కనుక పెడితే, రెడ్డి సామాజిక వర్గం అంతా ఏకమై, ఆయనకు మద్దతుగా నిలబడతారని, అలాగే నాయకులు లేక అల్లాడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా రేవంత్ పార్టీలో చేరుతారని, ఇలా అనేక లెక్కలను బయటకు తీసి చంద్రబాబు రేవంత్ కు నూరిపోశారు అట. ఇప్పటికే రేవంత్ బాబు మధ్య పార్టీ ఏర్పాటుకు సంబంధించి తీవ్రమైన చర్చ జరిగినట్లు, బాబు నైతిక మద్దతుతోనే రేవంత్ కథన రంగంలోకి దూకుతున్నట్టుగా తెలుస్తోంది.
-Surya