తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టానని, రాజధానిని తరలించేందుకు వీల్లేదని నిన్న మొన్నటి వరకు టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ప్రకటనలు ఇంకా ప్రజల చెవుల్లో వినిపిస్తూనే ఉన్నా యి. నిజమే! రాజధానిని తన కలల సౌధంగా, సింగపూర్ చేయాలని, రాష్ట్రాన్ని సన్ రైజింగ్ స్టేట్ చేయాలని ఆయన కలలు కన్నారు. ఈ క్రమంలోనే కృష్ణా, గుంటూరు జిల్లా మధ్య అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు. అనేక గ్రాఫిక్కులు సృష్టించారు. రైతుల నుంచి 33 వేల ఎకరాలను పూలింగ్ సిస్టమ్‌లో తీసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తన హయాంలో ఒక్క పర్మినెంట్ భవనం కూడా చంద్రబాబు నిర్మించలేక పోయారు.
తాత్కాలికంగా మాత్రమే కొన్ని భవనాలను ఆయన ప్రభుత్వం నిర్మించింది. అయితే, కేవలం ప్రణాళికల రూపంలో వందల కోట్ల రూపాయలను ఆయన వెచ్చించారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే, గత ఏడాది ఇదే రాజధానిని చూపించి ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమం లోనే తన కుమారుడిని కూడా రాజధాని నియోజకవర్గమైన మంగళగిరి నుంచి నిలబెట్టారు. కానీ, బాబు వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయిపోయి. ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక, తర్వాత వచ్చిన జగన్ రాజధానిని మారుస్తానని ప్రకటించారు. దీంతో రాజధాని మార్చేందుకు వీల్లేదంటూ.. అసెంబ్లీలోనే జగన్‌కు దణ్నాలు పెట్టిన చంద్రబాబు.. బయటకు వచ్చాక ధర్నాలు చేశారు.
రాజధాని ప్రజలను పోగేసి ఉద్యమాలు చేపట్టారు. మహిళల్లో సెంటిమెంటును రెచ్చగొట్టి.. వారి నుంచి బంగారాన్ని చందాల రూపంలో సేకరించారు. ఇక, రాజధానిని కాపాడుకునే ఉద్దమాల పేరిట చంద్రబాబు ఏకంగా జోలె పట్టారు. ఇంత జరిగిన తర్వాత.. ఇప్పటికి రాజధాని ఉద్యమం సాగుతున్న సమయంలో చంద్రబాబు అకస్మాత్తుగా మాట మార్చారు. “రాజధాని మార్చాలని జగన్ అనుకుంటున్నారు. కానీ, రైతులకు భారీగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి“ అన్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతూనే ఉంది.
నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు వారికి భూములను డెవలప్ చేసి మరీ ఇస్తామని అంటోంది. అప్పట్లో పరిహారం ఇవ్వడానికి వీల్లేదని రాజధాని కొనసాగించాలని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. అంటే.. ఇక, రాజధాని మార్పునకు బాబు మానసికంగా రెడీ అయిపోయారా? అనే సందేహం వ్యక్తమవుతుండడం గమనార్హం. మరి రాబోయే రోజుల్లో ఇంకెలాంటి మార్పులు చూడాల్సి వస్తుందో చూడాలి. ప్రస్తుతం ఇదే విషయంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ సాగుతోంది. బాబు చేతులు ఎత్తేశారని అంటే.. జగన్ వ్యూహానికి జై కొట్టకతప్పలేదని మరికొందరు కామెంట్లు చేస్తుండడం గమనార్హం.