నిజామాబాద్ రూరల్ డిచ్ పల్లి మండలం ధర్మారం గ్రామంలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వారం కిందట జరిగిన పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి?
కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న మహిళను వెంట తీసుకుని ధర్మారం గ్రామానికి నాలుగు నెలల క్రితం వలస వచ్చాడు. తామిద్దరం భార్యాభర్తలమని చెప్పి ఒకరి వద్ద కూలి పనికి చేరాడు. ఆ మహిళకు మొదటి భర్త ద్వారా పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు తమకు అడ్డుగా భావించాడు. వారం క్రితం రాత్రిపూట ఆరేళ్ల వయస్సున్న పెద్ద కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆపై ఆమె తలపై రాయితో కొట్టి గాయపరిచాడు.
అనంతరం చిన్నారికి ఫిట్స్ వచ్చాయని మహిళతో చెప్పి హడావిడి చేసి, చికిత్స పేరిట జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. అనంతరం అతడు వారిని వదిలి పరారయ్యారు. అనుమానం వచ్చిన చిన్నారి తల్లి తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కూతురుపై అత్యాచారం చేశాడని డిచ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.