ఈ వయసులో చంద్రబాబు రాజకీయాన్ని కరోనా కాటేసింది కానీ లేకపోతే ఇప్పటికీ ఏదో ఒక ఎత్తులు, పై ఎత్తులు, ఆపై ఎత్తులు వేసుకుంటూ పోయేవారు! కాకపోతే కరోనా కష్టకాలంలో కార్యకర్తలు కలిసిరావడం లేదు.. ఈయన కార్యకర్తలను కలవడం లేదు! దీంతో… ఎంతటి ఆవేశాన్నైనా అన్ లైన్ లో వ్యక్తపరచాల్సిన పరిస్థితి! ఇది జగన్ కు దొరికిన సువర్ణావకాశంగానే వైకాపా నేతలు భావించాలి!! జరుగుతున్న తప్పులను సరిదిద్దుకోవడంతో పాటు రిపీట్ కాకుండా చూసుకోవాలి! అలాకాని పక్షంలో… ప్రజాసమస్యలపై ఒక్కసారి ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వడం మొదలుపెడితే.. అనంతరం వారు తీసుకుంటూనే ఉంటారు! గతంలో బాబు చేసిందీ అదే కదా!!
విషయానికొస్తే… తాజాగా నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు. “దళితులపై జగన్ గారి దమనకాండ కొనసాగుతోంది.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో అధికార పార్టీ నాయకుడి ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్ ని చిత్రహింసలకు గురిచేసి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చెయ్యడం ఘోరం.. అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ ఇసుక మాఫియాని నిలదీసిన దళితయువకుడిపై పోలీసులే గూండాల్లా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.. మాస్కు అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని నడిరోడ్డులో బంధించి తీవ్రంగా హింసించి, పిచ్చోడి చేసి చంపేయాలని చూశారు. అవినీతికి సహకరించలేదని దళిత డాక్టర్ అనితారాణి గారిని వేధించారు. దళిత న్యాయమూర్తి రామకృష్ణ గారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. దళితులకు జీవించే హక్కు జగన్‌రెడ్డి రాజ్యంలో లేదా?” అంటూ ప్రశ్నించారు!
వీటిలో డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై జనాలకు క్లారిటీ ఉంది! అనితారాణి విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నట్లుంది!! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా సీతానగరంలోని యువకుడి విషయంలో జరిగింది దారుణమైన సంఘటనల్లో ఒకటిగా జనాలు కూడా భావిస్తోన్న పరిస్థితి! ఏ వర్గం అయితే పూర్తిగా అక్కున చేర్చుకుందో.. అన్ కండీషనల్ గా “జగన్ మా వాడు” అనుకుందో.. ఆ వర్గంపై ఇలాంటి దాడుల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!
ఈ సంఘటనకు సంబందించి ఇప్పటికే పోలీసుల సస్పెన్షన్స్ జరిగినా… ఆ వర్గం ప్రజలకు, ఆ వర్గంలోని జగన్ వీరాభిమానులకు మనసు నొచ్చుకోకుండా చూడాల్సిన బాధ్యతతోపాటు.. వరుసగా జరుగుతున్న “దళితులపై దాడులు” సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా జగన్ పై ఉంది అనేది బలంగా వినిపిస్తోన్న మాట! ఈ విషయంలో రోజు రోజుకీ టీడీపీ వాయిస్ పెంచేలా.. సంఘటనలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా జగన్ మరిచిపోకూడదు!! రాజకీయంగా ఆ వర్గం నేతలకు ఎంతో ఉన్నత స్థానాలను ఇచ్చిన జగన్… సామాన్య జనాల రక్షణ విషయంలో కూడా అలానే వ్యవహరించాలని ఆశిస్తున్నారు!!