కృష్ణా నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెల్సిందే. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తుంది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇది ఇలా ఉండగా చట్టపరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి Jagadish Reddy స్పష్టం చేసారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిందే జలవిద్యుత్ ఉత్పత్తి కోసమన్నారు. కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని, ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడంపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
శుక్రవారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్యను సృష్టించిందే ఏపీ సర్కార్ అని అన్నారు. తప్పు చేసిన వారే లేఖల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం జీవోల పేరిట చిలకపలుకులు పలుకుతోందని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నీటి అవసరాలు ఏపీకి పట్టవా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
మద్రాస్ కు మంచినీటి పేరుతో వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా నీళ్లను దోచుకున్నారని, సాగర్ ఎడమ కాలువ కింద రైతాంగానికి వైఎస్ 50 ఏండ్లు ద్రోహమే చేశారన్నారు. హుకుంలు జారీ చేయడం, దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు తెరిపించి.. తెలంగాణ రైతులకు అన్యాయం చేశారన్నారు. ఇరు రాష్ట్రాలకు పనికి వచ్చే ఫార్ములాను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకొస్తే.. ఫార్ములాను పక్కన పెట్టి అహంకారంతో పోతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ హక్కుల్ని ఎవరూ హరించలేరన్నారు.