ఎన్నో అవమానాలు దాటుకుని వచ్చారు జగన్. ఎన్నో అవరోధాలు దాటుకుని వచ్చారు జగన్. ఎన్నో సమస్యలు పరిష్కరించి మరీ! ఇటుగా వచ్చారు జగన్. స్థానికంగా ఆరోజు పార్టీకి పట్టు లేదు. కనీసం జెండా మోసే నాయకులు తొమ్మిది,పదేళ్ల కిందట లేరు. ఆత్మ గౌరవం ఒక్కటే ప్రధానం అనుకుని అధినేత్రి సోనియాను ధిక్కరించి జగన్ పార్టీ ప్రారంభించారు. రికార్డు స్థాయి విజయాలను నమోదు చేసేందుకు తొమ్మిదేళ్లు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఓ విధంగా చెప్పాలంటే పైకి అందరి కష్టం అని అనిపిస్తున్నా ఇది ఎలా చెప్పుకున్నా ఒక్కడి కష్టం. ఎలా అభివర్ణించుకున్నా ఆయన ఒన్ మేన్ ఆర్మీ. ఓ విధంగా ఇవాళ కొన్నిన నియంతృత్వ ధోరణులు ఉన్నా అవన్నీ పార్టీకి మేలు చేసేవే. ప్రభుత్వానికీ మేలు చేసేవే. కనుక జగన్ రూలింగ్ లో తప్పులు ఉంటే ఉండవచ్చు కానీ కొన్ని నిర్ణయాలు కొత్త చరిత్రకు సంకేతాలు.
వాటినే ఇప్పుడు టీడీపీ కూడా ఫాలో కానుంది. ప్రతి యాభై ఇళ్లకు ఒక వలంటీరును నియమించే పనిలో టీడీపీ కూడా ఉంది. అదేవిధంగా కొన్ని నిర్ణయాలు నగదు బదిలీలు మళ్లీ మళ్లీ ఫాలో అయ్యేందుకు టీడీపీ వెనుకంజ వేయడం లేదు కూడా! ఇక నిన్నటి వేళ జరిగిన క్యాబినెట్ విస్తరణకు వస్తే జగన్ కొన్ని మంచి నిర్ణయాలే వెలువరించారు. పాత ముఖాలను కాస్త తగ్గించాల్సింది అన్న వాదన ఉన్నా తప్పని సరి పరిస్థితుల్లో ఆ నిర్ణయం కూడా తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు వైసీపీ పెద్దలు.
ఇక ఇది ఎన్నికల టీం కాదని సజ్జల అంటున్నారు. జిల్లాలకు అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు నియమితులయ్యాకనే మొత్తం పొలిటికల్ టీం ఒకటి ఫాం అవుతుంది అని అంటున్నారు. ఓ విధంగా బీసీలకు అగ్ర స్థానం ఇవ్వడం మంచిదే కానీ అధికారాలు కూడా అదే విధంగా ఇస్తేనే ఆ పదవులకు ఓ విలువ ఉంటుందని ఓ వాదన వినిపిస్తోంది. జగన్ మొదట నుంచి చెబుతున్న విధంగా సామాజిక న్యాయం పాటిస్తున్నా కూడా అధికారాలు మాత్రం ఇవ్వడం లేదని దాంతో తామేం చెప్పినా సంబంధిత యంత్రాంగం వినడం లేదు అని ఓ వాదన కూడా వినిపిస్తోంది. ఇది కూడా ఇప్పుడు చర్చకు తావిస్తోంది. నాడు చంద్రబాబు క్యాబినెట్ లో ఓసీలు 58 శాతం ఉంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 42 శాతం ఉన్నారని లెక్కలు చెబుతోంది వైసీపీ. ఇదంతా 2014 నాటి మాట.
2017 క్యాబినెట్ లో అయితే ఓసీలు 60 శాతం అయితే, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు 40 శాతం మాత్రమే ఉన్నారని వివరిస్తోంది. అదే తమ హయాంలో అంటే 2019లో ఏర్పాటయిన జగన్ క్యాబినెట్ లో ఓసీలు 44 శాతం ఉండగా, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు 56 శాతం మంది ఉన్నారని గణాంకాలతో సహా చెబుతోంది. అదేవిధంగా 2022లో ఏర్పాటయిన క్యాబినెట్ లో ఓసీలకు 32 శాతం, మిగతా బడుగు వర్గాలకు 68 శాతం పదవులు కేటాయించామని, సామాజిక న్యాయం చంద్రబాబు కన్నా భిన్నంగా పాటించామని వెల్లడిస్తోంది. ఇదే తరహాలో తాము అన్ని వర్గాల అభ్యున్నతికీ పాటు పడుతున్నామని, బీసీలకే కాక అగ్ర వర్ణాల పేదలకూ ఆర్థిక సాయం అందిస్తున్నామని చెబుతోంది వైసీపీ. ఇవన్నీ బాగున్నా బీసీ వర్గాలకు చెందిన మంత్రులకు నిర్ణయాల అమలులో కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తేనే వారి ఆత్మగౌరవానికి తగు రీతిలో ప్రాధాన్యం ఇచ్చిన వారు అవుతారన్న వాదన కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది.
జగన్ పదవుల పంపకం వరకూ సాహసోపేత నిర్ణయాలే తీసుకుంటున్నారు కానీ పాలన వచ్చేటప్పటికీ అంతా తానై వ్యవహరించడంతో క్షేత్ర స్థాయిలో మంత్రులకు కనీస మర్యాద దక్కని సందర్భాలు గతంలో అనేకం వెలుగు చూశాయన్నది తాజా మాజీల వాదన. ఇదే వాదనను మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా వినిపిస్తున్నారు. ఆత్మ గౌరవం దక్కనందునే తాను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని అంటున్నారు. ఇక సీదిరి అప్పల్రాజు లాంటి వారు, కొత్తగా క్యాబినెట్లోకి వచ్చిన సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాద రావు లాంటి వారు కాస్తో కూస్తో కఠినంగా వ్యవహరించి అధికారులతో పనులు చేయించగలరు కానీ అదంతా జిల్లాల వరకే సచివాలయం స్థాయి పనులు కానీ పై స్థాయి నిర్ణయాలు కానీ నిధుల విడుదల విషయమై కానీ అధికారం అంతా సీఎం దగ్గరే! కనుక సీఎంఓను ధిక్కరించి పనులు చేయించుకోవడం జరగని పని అన్నది చాలా మంది తాజా మాజీలు వినిపిస్తున్న వాదన.అందుకే భవిత మారాలంటే సీఎం కూడా తన ప్రవర్తనలో కాస్త మార్పులు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నది ఇవాళ రాజకీయ పరిశీలకులు, సీనియర్ జర్నలిస్టులు చెబుతున్న హితవు.