కోడి కత్తి కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఎన్ఐఏ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కోడి కత్తి కేసులో తదుపరి దర్యాప్తు చేయాలని జగన్ తరపున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు ఒకటికి వాయిదా వేసింది.
ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రాజమహేంద్రవరం జైల్లో ఉన్నాడని, విజయవాడ ఎన్ఐఏ కోర్టులో రెగ్యులర్ విచారణకు ఇబ్బందిగా మారిందని నిందితుడి తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయమూర్తి వివరణ అడిగారు. దానికి జైలు సూపరింటెండెంట్ స్పందిస్తూ.. ఇక్కడి జైలులో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎన్ఐఏ కేసులో రిమాండ్‌లో ఉన్న ఖైదీకి జైలు నుండి విచారణ సాధ్యం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు.