రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాస్తవానికి మూడు రాజధానుల ప్రస్తావన అనేది ప్రభుత్వం తీసుకువచ్చినా సరే అమరావతి అనేది శాసన రాజధానిగా ఉంటుందని ముందు నుంచి చెబుతూ వస్తోంది. అయితే చంద్రబాబు హయాంలో మొదలుపెట్టిన రోడ్లు, డ్రైన్లు ఇతర ఇతర భవన నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆపివేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట ఎవరు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు..
అందుకే ఈ అంశం మీద సీరియస్ గా ఉన్న ప్రభుత్వం నిలిచిపోయిన రోడ్లు డ్రైన్లు భవన నిర్మాణ పనుల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వసతుల కల్పన నిధులు ఋణం రూపంలో తీసుకునేందుకు అమరాతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి మూడు వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది కాలంలో ఈ బ్యాంకు గ్యారంటీ వినియోగించుకోవాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక బ్యాంకు గ్యారంటీకి సంబంధించి ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మొత్తం అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన కోసం 11092 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు హయాంలో 29282 కోట్ల అంచనా లు ఉండగా 11092 కోట్లకు నిర్మాణ ఖర్చు కుదించారు. ఈ 11092 కోట్ల పనులు మూడు విడతల్లో పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. అందులో భాగంగానే తొలిదశలో మూడు వేల కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని భావిస్తోంది. ఈ పనుల్లో ప్రాధాన్యతను నిర్ణయించేందుకు ఇప్పటికే నిపుణుల కమిటీని కూడా నియమించారు వారంలో కమిటీ నివేదిక ఆధారంగా తొలివిడత పనులు మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది.