దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రభావం మళ్లీ పెరిగింది. కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేశారు. ఈ మేరకు తెలంగాణకు ఆనుకుని ఉన్న నాందేడ్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. దీంతో తెలంగాణకు కొంత ప్రభావం చూపనుంది.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతూ వచ్చాయి. అధికారులు కర్ఫ్యూ విధించినా ఫలితం లేకపోవడంతో ఈ తీసుకున్నట్లు సమాచారం. ఈ లాక్‌డౌన్ ఈరోజు నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉంటుందని అధికారులు సూచించారు. ప్రజారవాణా సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కిరాణం, పాలు, కూరగాయల దుకాణాలు ఓపెన్ ఉంటాయని, ఈ సమయంలో మాత్రమే ప్రజలు బయటికి రావాలని తెలిపారు.
తెలంగాణ బార్డర్‌లోని బీడ్ జిల్లాలోనూ రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రేపటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపారు. బీడ్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా కట్టడిలో ప్రజలు సహకరించాలని, బయటికి వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం, సామాజికదూరం పాటించడం, శానిటైజర్లు వాడటం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. అత్యవసర సేవలకు మాత్రమే బయటకు వచ్చే పర్మిషన్ ఉందన్నారు.
అయితే నాందేడ్, బీడ్ జిల్లాల్లో లాక్‌డౌన్ విధించడంతో దాని ప్రభావం తెలంగాణపై పడింది. ఆ జిల్లాల్లో రవాణా వ్యవస్థపై కఠిన ఆంక్షలు విధించారు. దీంతో తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రజా రవాణాను పూర్తిగా బంద్ చేయడంతోపాటు, ప్రైవేట్ వాహనాలపై కూడా కఠిన ఆంక్షలు విధించారు. కాగా, తెలంగాణలో కేసులు సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అప్రమత్తమై ముందు జాగ్రత్తగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను మూసివేయించింది.