ఆంధ్రావనిలో కొత్త కొత్త వివాదాలు అన్నీ పుట్టుకువస్తున్నాయి. వేతన సవరణపై నమ్మకంగా లేని ఉద్యోగస్తులు తాము కోల్పోయిందే ఎక్కువగా ఉందని ఇప్పటికే రోడ్డెక్కుతూ వస్తున్నారు. ఈ వివాదంలో అటు ఆర్టీసీ ఇటు విద్యుత్ శాఖ ఉద్యోగులు సైతం ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వీరంతా కూడా సమ్మెకు సిద్ధమేనని చెబుతున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం తప్పదని జిల్లాల వారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాక తరువాత కార్యాచరణను రాష్ట్ర రాజధానిలో చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు ఉద్యోగులు.
ఈ దశలో మంత్రుల రాయబారాలు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. పైకి మీడియా దగ్గర నోటికి వచ్చిందంతా మాట్లాడే మంత్రులు, ఉద్యోగ సంఘాల విషయమై కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వాళ్ల చేతిలోనే అంతా ఉంది అన్న భావనను స్థిరం చేసేలా ప్రవర్తించకూడదన్న ఆలోచన అయితే మంత్రులకు ఉంది.
కానీ జగన్ నిర్ణయాలను మంత్రులు వివరించడమే తప్ప కొత్తగా వారు సాధించేదేమీ లేదు. కనుక మంత్రులతో చర్చలు కూడా ఉద్యోగ సంఘాలకు కలిసివచ్చేలా లేవు. ఇదే దశలో ఉద్యోగులపై కూడా స్థానికంగా చాలా వివాదాలు, విమర్శలు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడకుండా సమ్మెకు పిలుపు ఇవ్వడం కూడా సబబుగా లేదన్న వాదన ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
ఇలాంటి సమయంలో జగన్ మధ్యేమార్గంగా జీఓలు నిలుపుదల చేస్తే సమస్య కాస్త పరిష్కారం కావొచ్చు. ఇక హైకోర్టు గుమ్మంలో ఈ వివాదం ఉంది కనుక చట్టం ఏం చెబుతోంది. అందులో ఉన్న నిబంధనలను అనుసరించే ఉద్యోగికి జీతాలు ఇవ్వాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఉల్లంఘించాలని యోచిస్తుందా అన్నది కూడా తేలాలి.
ఈ నేపథ్యంలో ఈ తరుణంలో పీఆర్సీకి సంబంధించి ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ రేపటి వేళ విచారణకు రానుంది. దీంతో జగన్ కు టెన్షన్ పట్టుకుంది. కొత్త జీఓలను రద్దు చేయాలని, ఇవన్ని హక్కులకు విరుద్ధంగానే ఉన్నాయని ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అంటోంది.
దీంతో ఈ సంఘం వాదనతో రేపు కోర్టు ఏకీభవిస్తుందో లేదో అన్నది ఇప్పుడిక ఉత్కంఠ గా ఉంది. మరో వైపు కొత్త పీఆర్సీ కనుక అమలైతే లక్ష రూపాయల వరకూ తాము కోల్పోనున్నామని పింఛనర్లు సైతం గగ్గోలు పెడుతున్నారు. ఈ దశలో ఎందుకువచ్చిన గొడవ పాత పద్ధతిలోనే జీతం చెల్లించాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఇందుకు సుముఖంగా లేదు. జగన్ ఎలా అయినా తన మాటనే నెగ్గించుకోవాలని భావిస్తూ ఉన్నారు.