ఔను! ఇప్పుడు వైసీపీ నేతల మధ్యే కాదు.. ఆ పార్టీ సానుభూతి పరుల నోటి నుంచి ఇదే వినిపిస్తోంది. ఏదైనా విషయాన్ని ప్రజలకు చెప్పుకోవడంలో జగన్ సర్కారు తడబడుతోందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. తాము చేయాలనుకుంటున్నది మంచే అయినా.. ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ కాలేక పోతున్నారు. ఉదాహరణకు.. సమగ్ర భూసర్వే విషయాన్ని తీసుకుంటే.. ఇది చాలా మంచి పరిణామం. ఇప్పటి వరకు తెలంగాణలో భూభారతి పేరుతో నిర్వహించారు. అయితే, అక్కడ సగంలోనే దీనిని వదిలేశారు. కానీ, ఏపీలో మాత్రం సంపూర్ణంగా అమలు చేయాలని నిర్ణయించారు.
భూములకు సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనుకున్న విధంగా ప్రజలలోకి తీసుకువెళ్లలేక పోయారు. ఫలితంగా తమ భూములు లాగేసుకునేందుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. చాలా జిల్లాల్లో ఈ సర్వేను వ్యతిరేకిస్తున్నట్టు ప్రభుత్వానికి నివేదికలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం ప్లేస్‌లో ఇంగ్లీష్ ను ప్రవేశ పెడతామని బాంబు పేల్చారు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. కానీ, వాస్తవానికి ప్రభుత్వం వ్యూహం వేరు. తెలుగు కోరుకున్న వారికి తెలుగులోనే బోధన చేయాలని.. ఇంగ్లీష్ కోరుకున్న వారికి ఇంగ్లీష్ విద్యను అందించాలని నిర్ణయించుకుంది.
దానికి తగిన విధంగానే పుస్తకాలను కూడా ముద్రించారు. ఒకవైపు తెలుగు, రెండో వైపు ఇంగ్లీష్‌లో పాఠ్యాంశాలను ముద్రించారు. కానీ, సదరు సూచనలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలోపే.. వివాదం ఏర్పడి మొత్తానికే ఎసరు వచ్చింది. స్థానిక ఎన్నికల విషయంలోనూ ఇలానే చేయబోతోందనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఈ నెల 28న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో ఆల్ పార్టీ మీటింగ్ ఉంది. దీనిలో వైసీపీ వ్యూహం ఏంటనేది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయంలో ప్రభుత్వం మొండి పట్టుదలతో ఉందని టీడీపీ వర్గాలు అప్పుడే వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి. కానీ .. ప్రభుత్వ వాదన వేరుగా ఉంది.
అప్పట్లో అంటే మార్చిలో కరోనా లేనప్పుడే ఎన్నికలకు వద్దన్న కమిషన్ ఇప్పుడు రోజుకు 50 మంది చనిపోతున్నారు.. కాబట్టి వాయిదా వేయాలనే ఉద్దేశంతో ఉంది. ఈ విషయాన్ని కన్వే చేయడంలోనూ సర్కారు ఫెయిల్ అవుతోందని అంటున్నారు. ఇలా.. చాలా అంశాల్లో ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా.. ప్రజలకు వివరించడంలో మాత్రం ఫెయిల్ అవుతోందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఇక, మంత్రులు కూడా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు తప్ప.. విషయాన్ని విషయంగా మాత్రం తీసుకువెళ్లలేక పోతున్నారనే వాదన కూడా ఉండడంతో ప్రజలు యాంటి ప్రచారానికే మొగ్గు చూపుతుండడం గమనార్హం.