కేసీఆర్ బాట‌లో జ‌గ‌న్‌

-

తిరుప‌తి లోక్‌స‌భ‌కు జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేయించ‌డానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతోంది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యాన్ని సాధించిన ఆ పార్టీ ఆనంద డోలిక‌ల్లో తేలియాడుతోంది. విజ‌యం ప‌క్కా అని వైసీపీ శ్రేణులు ఖాయం చేసుకున్నాయి. ఎంత మెజార్టీ సాధించాల‌నేదానిపై దృష్టిపెట్టాలంటూ ఇటీవ‌లే అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. అంటే తిరుప‌తి గెలుపుపై వైసీపీ అంత న‌మ్మ‌కంతో ఉంది. ఆ న‌మ్మ‌కాన్ని శ్రేణులు నిల‌బెడ‌తాయా? లేదా? అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది. ఇక్క‌డ నుంచి గెలుపు కోసం, మెజార్టీ కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహాన్ని వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి అమ‌లు చేయ‌బోతున్నారు.

గురుమూర్తి గెల‌వాలి

తిరుప‌తి ఉప ఎన్నిక సందర్భంగా లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మంత్రి ఇన్‌చార్జిగా ఉంటారని.. ఒక ఎమ్మెల్యే అదనంగా పని చేస్తారని ముఖ్య‌మ‌త్రి చెప్పారు. గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పార్టీనేత‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి త‌న కోరికను బయటపెట్టారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం. గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేసిన ఆయన..తిరుపతి ఉప ఎన్నిక ఫలితంతో దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా చేయాలనేది త‌న‌ అభిలాష అని, దీనికి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాటుప‌డాల‌ని కోరారు.

ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోండి

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి తాజాగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని చూస్తే ఇటీవల కేసీఆర్ ఏర్పాటు చేసిన స‌మావేశ‌మే గుర్తుకువ‌స్తోంది. తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి దివంగత ప్ర‌ధాన‌మంత్రి పివి న‌ర‌సింహారావు కుమార్తె వాణీదేవిని అభ్యర్థిగా బరిలోకి దింపిన స‌మ‌యంలో కేసీఆర్‌ పార్టీకి చెందిన పలువురు నేతల్ని తన ఇంటికి ఆహ్వానించారు. వారంద‌రికీ వాణీదేవిని ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చ‌ర్చించారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఏపీ ముఖ్య‌మ‌త్రి జ‌గ‌న్‌రెడ్డి తిరుప‌తి లోక్‌స‌భ ఎన్నిక కోసం ఉప‌యోగిస్తున్నారు. దీన్నిబ‌ట్టి గురుముర్తి కోసం ఆయ‌న ఎంత ప్రాధాన్య‌త ఇస్తున్నారో అర్థ‌మ‌వుతోంది. రాజ‌కీయ వ్యూహాల్లో దిట్ట అయిన కేసీఆర్ బాట‌ను ఎంచుకుంటే విజ‌యం సులువ‌వుతుంద‌నే విష‌యాన్ని జ‌గ‌న్‌రెడ్డి గుర్తించిన‌ట్లున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news