ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తాజాగా స్థానిక సంస్థల కోటాలో మరో 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే వైసీపీకి పూర్తి బలం ఉండటంతో 14 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. టీడీపీ పోటీలో దిగిన ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు.
ఇక 14 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ నుంచి పోటీ ఎక్కువగానే ఉంది. దీంతో సీఎం జగన్ ఆచి తూచి నిర్ణయం తీసుకొనున్నారు….పార్టీ కోసం కష్టపడే నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా కమ్మ వర్గానికి జగన్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మామూలుగా జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కమ్మ వర్గంపై కక్ష సాధించే దిశగా పనిచేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
అటు పవన్ కల్యాణ్ సైతం….జగన్ ప్రభుత్వం ఒక వర్గాన్ని అణిచివేయాలని చూస్తుందని విమర్శిస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీలో కమ్మ నేతలకు పెద్ద పీఠ వేస్తున్నామని జగన్ ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొడాలి నాని మంత్రివర్గంలో చోటు కల్పించిన విషయం తెలిసిందే. అలాగే పలువురు కమ్మ నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఇంకా పలువురు నేతలు వివిధ పొజిషన్స్‌లో ఉన్నారు. ఇదే క్రమంలో కొందరు కమ్మ నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడానికి జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని తెలుస్తోంది.
అలాగే తనకు మొదట నుంచి అండగా ఉంటున్న తలశిల రఘురామ్‌కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారు. పాదయాత్రలో సమయంలో రఘురామ్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ విషయం జగనే స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. కమ్మ వర్గానికి చెందిన రఘురామ్ తన సన్నిహితుడు అని, తన కార్యక్రమాలు అన్నీ ఆయనే చూసుకుంటారని అన్నారు. ఇప్పుడు జగన్ కార్యక్రమాల కొ-ఆర్డినేటర్‌గా ఉన్నారు. ఇలా జగన్‌కు అండగా ఉంటున్న రఘురామ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.