అయ్యయ్యో.. ఏమీ చేయలేకపోతున్నారు.. మరేమీ అడుగలేకపోతున్నారు..! గట్టిగా అడిగితే కేంద్రం నుంచి రిటర్న్ గిఫ్ట్ తప్పదు.. అడుగకపోతే జనం ఊరుకోరు..! ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి, ఎంపీల పరిస్థితి.. హస్తినలో ప్రధాని నో అపాయింట్‌మెంట్.. కనీసం మంత్రులైనా ఇస్తారా.. అంటే అది కూడా లేదు.. ఏం చేయాలి..? ఏపీ ప్రజలకు ఏం చెప్పాలి..? ఇలా అయితే.. ముందుముందు మరిన్ని కష్టాలు తప్పేలా లేవే.. ఇప్పుడు జగన్ టీమ్‌ను వెంటాడుతున్న అం శాలు ఇవే.. మాకు 25ఎంపీ సీట్లు ఇవ్వండి.. కేంద్రం మెడలు వంచి మన హక్కుల్ని సాధిస్తాం.. అని ఎన్నికల ప్రచారం సమయంలో వైసీపీ అధినేత జగన్ పదేపదే చెప్పారు. ఆయన కోరినట్టుగానే ఏకంగా రెండు తక్కువ 23సీట్లు ఇచ్చారు.
కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. కేంద్రం మెడలు వంచడం కాదు కదా.. కేంద్రం అనేగానే జగన్ అండ్ టీమ్ వణికిపోతున్నట్లు తెలుస్తోంది. ఏపీకి కేంద్రం నుంచి అందాల్సిన సాయం అందడం లేదు. గట్టిగా అడుగుదామంటే.. అది అనేక రూపాల్లో మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. ఇప్పటికే సీబీఐ.. ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. దీంతో కేంద్రాన్ని గట్టిగా అడిగితే.. పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం సులభమే.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్కడిపనులు అక్కడ నిలిచిపోతున్నాయి. త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానునున్నాయి. దీంతో ఎంపీలకు జగన్ ఎలా దిశానిర్దేవం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి.. 2014 ఎన్నికల తర్వాత బీజేపీ-టీడీపీ సుమారు మూడేళ్లపాటు నడిచిన విషయం తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబుపై ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చేసిన విమర్శలు అన్నీఇన్నీ కావు. చంద్రబాబు చేతగాని తనం వల్లే.. కేంద్రం ఏపీకి ఏమీ ఇవ్వడం లేదని విరుచుకుపడ్డారు.
ఇక ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు కూడా కేంద్రంపై, అందులోనూ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయినా.. మోడీ పెద్దగా పట్టించుకోలేదు. చాలా లైట్‌గా తీసుకున్నారు. కానీ.. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పరిస్థితి బాబుకన్నా అధ్వానంగా మారిందనే టాక్ జనంలో మొదలైంది. ఈ పరిస్థితి నుంచి జగన్ అండ్ టీమ్ ఎలా బయటపడుతుందో చూడాలి మరి.