ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పరిస్థితులు చేయి దాటే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇన్నాళ్ళు తమకు తిరుగు లేదని భావించిన వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో వ్యతిరేకత అనేది కనపడుతుంది. ఇన్నాళ్ళు జగన్ కాస్త దూకుడుగా వెళ్ళినా సరే ఇప్పుడు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న ఉద్యమం ఇప్పుడు రాష్ట్రం మొత్తం పాకే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రభుత్వ వ్యవహారశైలి అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
వాస్తవానికి రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చినప్పుడు రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యవహరించాలి. రాజధాని తరలింపు అనేది ఇప్పుడు అవసరం లేని వ్యవహారం. డబ్బులు ఉన్నప్పుడు చేసుకుంటే ఇబ్బంది లేదు. కాని అనూహ్యంగా రాజధానిని మార్చాలని జగన్ భావించడం, ఆయనకు అనుకూలంగా కమిటీల నివేదికలు ఇప్పించుకోవడం అనేది ఆయనకు మినహా ఎవరికి రుచించడం లేదు. జగన్ విశాఖ వెళ్ళినప్పుడు అక్కడి ప్రజల్లో మద్దతు లేదనే విషయాన్ని గ్రహించారు. ఆ తర్వాత యేవో వరాలు విశాఖకు ఇచ్చారు.
అసలు అక్కడి ప్రజల్లో రాజధాని వస్తుందనే సంతోషం ఏ కోశానా కనపడటం లేదు. రాజధాని ప్రాత రైతుల విషయానికి వచ్చి ఒకసారి చూద్దాం, రైతుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనేది ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. పోలీసులు రైతుల మీద పదే పదే చేయి చేసుకోవడం అనేది మంచి సంకేతం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల తీరుపై విమర్శలే వినపడుతున్నాయి. గుడికి వెళ్ళాలి అనుకుంటున్న మహిళా రైతులను ఏ కారణం చేత ప్రభుత్వం అడ్డుకుందో చెప్పాల్సిన అవసరం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
తమ భూములు తీసుకుని చంద్రబాబు మీద కక్షతో తమను ఆ విధంగా కొట్టడంపై అక్కడి రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసహనం వ్యక్తమవుతుంది. మహిళలను ఈడ్చేస్తున్న ఫోటోలు చూసి ఇన్నాళ్ళు జగన్ కి మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాఠీ చార్జ్ చేయడం అనేది అన్ని సందర్భాల్లో సరైన విధానం కాదు అనే విషయాన్ని జగన్ గ్రహించాలి. పోలీసులు పై అధికారులు చెప్పారు కదా అని రెచ్చిపోవడం తగదు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతుంది. రాజధాని ఉద్యమాన్ని చంద్రబాబు లాంటి నేత భుజానికి ఎత్తుకున్నారు కాబట్టి జగన్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.