ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. సీఎం జగన్ మోహన్ రెడ్డి.. వైసీపీ పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తాజాగా.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కొత్త తరహా సమీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటిదాకా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన సీనియర్ నేతలతో భేటీ అవుతున్న జగన్… తాజాగా పార్టీ కార్యకర్తలతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ తరహాలో సరికొత్తగా ప్రారంభం కానున్న ఈ భేటీలు ఇవాళ్టి నుంచే మొదలుకానున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలతో జగన్ నేడు భేటీ కానున్నారు. ఈ భేటీతోనే కార్యకర్తలతో జగన్ భేటీలు ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతల పనితీరు, కార్యకర్తలకు పార్టీ నుంచి అందుతున్న మద్దతు, 2024 ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. ఇలా దాదాపుగా అన్ని కీలక అంశాలపైనా జగన్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.