తాను పార్టీ మారడంలేదని, తనపై అసత్య ప్రచారం చేసేవారిని తన అనుచరులకు అప్పగిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. సోమవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 41 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో సవాళ్లు.. కష్టాలు అనుభవించానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ మారడం లేదని నిన్ననే స్పష్టతనిచ్చానని, అయినప్పటికీ ప్రచారం చేస్తున్నారన్నారు. తన గురించి నెగిటివ్ ప్రచారం చేస్తే అధిష్ఠానంకు ఫిర్యాదు చేస్తానని, పరువు నష్టం దావా వేస్తానని, లీగల్ నోటీసులు పంపిస్తానని అన్నారు. అయినప్పటికీ వారు మారకుంటే వారిని తన అనుచరులకు అప్పగిస్తానన్నారు.
తాను మీడియా సమక్షంలో పార్టీ మారనని చెప్పినప్పటికీ కొంతమంది గుసగుసలు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తనను అనుమానించే వారికి ఏం పని లేదా? అని ప్రశ్నించారు. నలభై ఒక్క సంవత్సరాలుగా కష్టపడి రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. గుసగుసలు చెప్పుకునే వారు ఇప్పటికైనా ఆపేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అప్పులు చేసి తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. తనకు పెద్దమొత్తంలో ఆస్తులున్నాయని నిరూపిస్తే అలా ప్రచారం చేసినవారికే అప్పగిస్తానన్నారు.