కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్ పై తన మార్క్ కామెంట్స్ చేశారు జానారెడ్డి. అభిమానం ఉంటే సొంత పార్టీలోని ఇతర నాయకుల్ని విమర్శిస్తారా అంటూ చురకలంటించారు..ఇలాంటి నాయకులు కార్యకర్తలతో పార్టీకి నష్టం తప్పదని అవసరమైతే అధిష్టానం దృష్టికి ఈ సమస్య తీసుకెళ్తానంటూ రేవంత్ రెడ్డి వర్గానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు పెద్దాయన..
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువై పోతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి మండిపడ్దారు. అలాంటి వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదన్నారు. పీసీసీ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు జానారెడ్డి. గ్రూపులతో పార్టీ బలహీన పడుతుందన్నారు. పార్టీని బలహీనపరిచే వారిపై పీసీసీ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పీసీసీ స్పందించకపోతే.. హైకమాండ్ దృష్టికి ఫిర్యాదు చేస్తానన్నారు. పార్టీలో సీనియర్ల నుంచి చిన్న నాయకుల వరకు అందరిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీని పై పార్టీలో ఎవరికి వారు బాధపడుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.
ఎవరు అవమానం చేసినా.. అపహస్యం చేసిన అది పార్టీకే నష్టం అన్నారు. ఏ నాయకుడ్ని అయినా అభిమానిస్తే… కార్యకర్తలు క్రమశిక్షణతో ఆయనకు తమ మద్దతు ఇవ్వాలన్నారు. అంతేకాని పార్టీకి చెందిన ఇతర నాయకుల్ని విమర్శించకూడదన్నారు. అలాంటి చర్యలు వల్ల ఘర్షణ వాతావరణం, మనస్పర్థలు ఏర్పడతాయన్నారు. ఇలాంటి చర్యలు పార్టీకి, నాయకత్వానికి సరైనవి కాదని జానారెడ్డి హెచ్చరించారు. కార్యకర్తలు అభిమానించే నాయకుడు కూడా తన వెంట ఉన్నవారిని కట్టడి చేయాలన్నారు. అలా చేయకుంటే ఆ నాయకుడికి, ఆయన వెంటున్న వారికి కూడా నష్టం తప్పదన్నారు జానారెడ్డి.
జానారెడ్డి వ్యాఖ్యలు మాత్రం రేవంత్ రెడ్డి అభిమానులకే పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఒక నాయకుడిని గౌరవిస్తూ మరో నాయకుడిని అవమానపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై స్పందించిన పెద్దాయన కాస్త ఘాటుగానే స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోవం పైగా యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్తూ సీనియర్లని దూరం పెడుతున్నారన్న వాదన పార్టీలో ఉంది. దీన్ని మనసులో ఉంచుకున్న పెద్దాయన సమయం చూసి రేవంత్ వర్గానికి కౌంటర్ ఇచ్చారు.
పార్టీ నేతల మధ్య ఏమైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలన్నారు. పార్టీలోని నేతలు పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతల పైనే ఈ రకమైన పోస్టులు పెట్టడం వల్ల తమను అభిమానించే నాయకుడికే నష్టమని రేవంత్ అనుచరులకు వార్నింగ్ ఇచ్చారు జానా. మొత్తం మీద కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలున్నాయని జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీపీసీసీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే రేవంత్ అభిమానులకే జానారెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని సొంత పార్టీ నేతలతో పాటు.. ఇతర పార్టీల నేతలు సైతం చర్చించుకుంటున్నారు.