“బీజేపీ-జనసేన“ కూటమిని అధికారంలోకి తీసుకురావడమే మా ధ్యేయం.. దానికోసం కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతాం“ ఇదీ.. కొన్నాళ్ల కిందట ఇటు బీజేపీ, అటు జనసేన నేతలు చేసిన ప్రకటన. అంతేకాదు, ఇరు పక్షాలు కూడా ఒకే వేదికపైకి వచ్చి.. మీడియా సమావేశాలు కూడా పెట్టారు. ఇక, బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఏకంగా.. మరో నాలుగు అడుగులు ముందుకు వేసి.. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎం అవుతాడంటూ.. బాంబు పేల్చారు. జనసేన తరఫున కూడా బీజేపీతోనే కొనసాగుతామని, తమ మధ్య విభేదాలు లేవని చెప్పడం గమనార్హం.
అంతా బాగానే ఉంది. రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. అయితే, గడిచిన నెల రోజులుగా మాత్రం చడీ చప్పుడు లేకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ దూకుడుగా ఉంటే.. జనసేన సైలెంట్‌గా ఉన్న పరిస్థితి కనిపించింది. అదేసమయంలో జనసేన మాటల తూటాలు పేలిస్తే.. బీజేపీ మౌనం పాటించిన విషయం చూశాం. కానీ, ఎటొచ్చీ.. ఇప్పుడు రెండు పార్టీలూ సైలెంట్ అయ్యాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలే లేనట్టు.. ఏమీ జరగనట్టు.. తాము జోక్యం చేసుకోవాల్సినవి ఏమీ లేనట్టుగా బీజేపీ నేతలు.. జనసేన నేతలు కూడా మౌనం పాటించడంతో అసలు ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం రాజకీయాలను పక్కన పెట్టినా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో అయినా.. ప్రజలు, రైతుల దుస్థితిని పరిశీలించేందుకు ఈ రెండు పక్షాలు ప్రయత్నించాలి కదా? పైగా అటు తూర్పులో సోము వీర్రాజు మౌనంగా ఉంటే.. ఇటు గుంటూరులోనే ఉన్న జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గడప దాటలేదు. ఈ పరిణామాలు గమనిస్తే.. ప్రభుత్వానికి సహకరించే వ్యూహం ఏదో ఉందని కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. మేం ఎక్కువగా మాట్లాడితే.. వచ్చే క్రెడిట్ ఆ పార్టీ పంచుకుంటోందని జనసేన నేతలు అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
పోనీ.. బీజేపీ అయినా.. ముందుకు రావొచ్చు కదా.. అంటే.. ఇటీవల కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆచి తూచి అడుగులు వేయాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయని ప్రచారం ఉంది. దీంతో ఈ కూటమి ఫుల్లుగా సైలెంట్ అయిందని అంటున్నారు. మరి ఎన్నికల వరకు ఇంతేనా? లేకపోతే.. ఈలోగా ఏమైనా కదలిక వస్తుందా? అనేది చూడాలి.