జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ టెలీ కాన్ఫరెన్స్ కొనసాగుతోంది…పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తోట చంద్ర శేఖర్ మాట్లాడుతూ “రాజధాని వికేంద్రీకరణకు పూర్తి స్థాయిలో ప్రజామోదం కనిపించడం లేదు. ప్రజలు ఉద్యమించాలన్నా కోవిడ్ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. ఈ అంశంపై న్యాయపరమైన పోరాటం చేపట్టాలిసిన సమయం వచ్చింది. అమరావతిలో రాజధాని కోసం వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారు. ఇలా చేస్తే ప్రభుత్వం మీద ప్రజలకు భరోసా పోతుంది. ఇకపై భూ సమీకరణలు, భూసేకరణలు చేపడితే ప్రజలు ఏం నమ్మి భూములు ఇస్తారు.” అని అన్నారు.
పి.ఏ.సి. సభ్యులు, సీనియర్ నేత కె.నాగబాబు మాట్లాడుతూ “రాజధాని విషయంలో తొలి నుంచి ఒకే విధానం, ఒకే మాట మీద ఉన్నది జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మాత్రమే అన్ని వేల ఎకరాల భూమిని సమీకరిస్తే ఏదైనా సమస్య ఉత్పన్నమైతే రైతులకు ఎవరు భరోసాగా ఉంటారు అని 2015లోనే బలంగా మాట్లాడారు. ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు రాజధాని తీసుకువెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. ప్రభుత్వమే మోసం చేస్తోంది. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారకులు చంద్రబాబు నాయుడే. ఆయన నాడు చేసిన తప్పిదాల వల్లనే నేడు జగన్ తనకు అనుకూలంగా మార్చుకొని రాజధాని తరలించుకొని వెళ్తున్నారు అని అన్నారు.