బెజవాడ కార్పోరేషన్లో వైసీపీ,టీడీపీ ని టెన్షన్ పెడుతున్న జనసేన

-

ఏపీలోనే కీలకమైన బెజవాడ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవటానికి అటు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఏపీలోనే బెజవాడ కార్పొరేషన్ రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమైంది. ఇక్కడ గెలిస్తే…రాష్ట్రవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందనేది పార్టీల నమ్మకం. ఇప్పుడు కొత్తగా జనసేన బరిలోకి దిగటంతో… ఆ పార్టీ ఎవరికి చేటు చేస్తుందోనని… నేతలు టెన్షన్‌ పడుతున్నారు.

బెజవాడ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని గెలవటానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బెజవాడ కార్పొరేషన్లో గత ఎన్నికల్లో 59 డివిజన్లు ఉంటే ఇప్పుడవి 64కి చేరుకున్నాయి. బెజవాడ మేయర్ పీఠాన్ని గత ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంది. సింగిల్‌గా పోటీ చేసి 37 డివిజన్లు గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు 33 సీట్లు వచ్చిన వాళ్ళదే మేయర్ పీఠం. గత ఎన్నికల్లో వైసీపీ ఆశించిన మేర ఫలితాలు రాలేదు. తూర్పులో 9, పశ్చిమలో 7, సెంట్రల్లో 3 డివిజన్లు మాత్రమే వైసీపీ గెలిచింది. సెంట్రల్‌లో టీడీపీ 17 సీట్లు గెలిచి సత్తా చాటింది.

ఇప్పుడు టీడీపీ ఎంపీ కేశినేని నాని అంతా తానై అన్నట్టుగా ఎన్నికల వ్యవహారం నడుపుతున్నారు. మేయర్ అభ్యర్థి ఆయన కుమార్తె శ్వేతేనని కేశినేని అనుచరులు చెబుతున్న నేపథ్యంలో… కొన్ని సీట్ల విషయంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరాకు ఎంపీ కేశినేని నానికి మధ్య విబేధాలు మొదలయ్యాయి. కొన్ని సీట్లు మార్చాలని కేశేనేని నాని పట్టుపట్టడం టీడీపీలో విబేధాలకు కారణమైంది.

ఇక జనసేన తొలిసారి బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తు వల్ల సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. 64 డివిజన్లలో 37 చోట్ల జనసేన, 27 చోట్ల బీజేపీ పోటీ పడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఓట్లు వచ్చిన డివిజన్లు, సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్న డివిజన్లపై జనసేన ఫోకస్ పెట్టింది. గతంలో ప్రజారాజ్యం బెజవాడలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఇప్పుడు జనసేన కొన్ని డివిజన్లు గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ ఓటు బ్యాంకుపై బీజేపీ ఫోకస్ పెట్టింది.

2000, 2015లో బెజవాడ మేయర్ పీఠాన్ని టీడీపీ గెలవగా, 2005లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి గెలిచాయి. 2000 ముందు వామపక్షాలే మేయర్ పీఠాన్ని గెలిచాయి. ఇప్పుడు వైసీపీ గెలిస్తే తొలిసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నట్టే. దీనితో వైసీపీ పూర్తి స్థాయి ఫోకస్ పెట్టింది. టీడీపీతో కలిసి 5 స్థానాల్లో సీపీఐ, 23 స్థానాల్లో ఒంటరిగా సీపీఎం పోటీకి దిగి… తమ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. చివరికి ఏ పార్టీ మేయర్ సీటును కైవసం చేసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news