జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రాజధానుల విషయంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు! మొదటి నుంచి జనసేన అధినేత… వైఎస్ జగన్ గతంలో ప్రతిపక్షంలో అమరావతి గురించి ఏం మాట్లాడారో వల్లె వేస్తున్నారు గానీ… తన నిచ్చితమైన అభిప్రాయాన్ని రాజధాని పట్ల చెప్పలేకపోతున్నారు. అయితే ఈ విషయంలో ఇక నాంచితే ప్రయోజనం లేదని భావించారో ఏమో కానీ… పరోక్షంగా జైకొట్టే సంకేతాలు ఇచ్చారు!
జనసేన అధినేతగా గతంలో టీడీపీతో లోపాయికారి ఒప్పందం.. ఎన్నికల తర్వాత బీజేపీతో భాగస్వామ్యం.. వెరసి పవర్ స్టార్ కి ఇదివరకు ఉన్నంత బలం, స్వేచ్చ ప్రస్తుతం లేకుండా పోయాయి. అయితే తాజగా బీజేపీ స్టాండ్స్ కే సై అంటున్న పవన్… ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా జనసేన – బీజేపీ కలసి ముందుకెళ్తాయని తెలిపారు. అందుకు అవసరమైన ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు.
అదేవిధంగా రాజధాని అమరావతి, రాష్ట్ర ఆర్థికస్థితి, కేంద్ర నిధుల వ్యయం, వర్తమాన రాజకీయ స్థితిగతులపై వీర్రాజుని కలిసిన సందర్భంగా చర్చించుకున్నామని తెలిపారు. అమరావతి రైతుల పక్షాన బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. తమకు ఏ ఒక్క ప్రాంతమో ముఖ్యం కాదని.. రాష్ట్ర సమగ్రాభివృద్దే ప్రధానమని తెలిపారు.
అంటే… చంద్రబాబు స్టాండ్ లాగా కేవలం ఒక్క ప్రాంతం, తాను అనుకున్న ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలని, మిగిలిన ప్రాంతాలను గాలికి వదిలేయాలని బీజేపీ భావించడం లేదు అనేది పవన్ మాటగా ఉంది. సో.. బీజేపీ ఆలోచనే పవన్ ఆలోచన కాబట్టి… పరోక్షంగా వికేంద్రీకరణకే పవన్ కల్యాణ్ కూడా మొగ్గు చూపారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.