దీపావళికి జియో 5G సేవలు.. మొదట ఆ 4 నగరాల్లోనే

-

జియో 5జీ సేవలకు సంబంధించి రిలయన్స్ దిగ్గజం ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. ఈ దీపావళికి కానుకగా 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మొదటగా నాలుగు మహానగరాల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీపావళి కానుకగా దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై సహా కీలక నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. దశలవారీగా 2023 డిసెంబరు నాటికి ఇతర నగరాలు, పట్టణాలకు 5జీని విస్తరిస్తామని ప్రకటించారు.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ సేవలను ప్రవేశపెట్టాలనేది జియో లక్ష్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ అన్నారు. ప్రతినెలా జియో 5జీ సేవలు విస్తరించుకుంటూ వెళ్తామని తెలిపారు. 2023 డిసెంబర్ కల్లా అంటే రాబోయే 18 నెలల్లో దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి మండలంలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇందుకోసం మొత్తం రూ.2 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 5జీ సేవల వివరాలను ముకేశ్ వెల్లడించారు. పాన్‌ ఇండియా స్థాయిలో జియో 5జీ సాంకేతికత కోసం రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. అత్యంత నాణ్యమైన, అందుబాటు ధరల్లో జియో 5జీ సేవలను ప్రతి ఒక్కరికీ అందించనున్నట్లు అంబానీ ప్రకటించారు. భారత్‌ను డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మలిచేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల్లోనూ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు అంబానీ వివరించారు. అల్ట్రా హైస్పీడ్ జియో ఎయిర్‌ ఫైబర్‌ పేరిట జియో 5జీ ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తామని తెలిపారు. గూగుల్‌తో కలిసి 5జీ ఫోన్‌ను తేనున్నట్లు ప్రకటించారు. అందుబాటు ధరల్లోనే అందిస్తామని ప్రకటించింది. 5జీ సొల్యూషన్స్‌ కోసం క్వాల్‌కామ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news