టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు శుభవార్త చెప్పబోతోంది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే చాన్స్ అందివ్వనుంది. జియో, హాట్‌స్టార్ కంపెనీలు ఈ మేరకు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయి. డీల్ ఓకే అయితే.. జియో కస్టమర్లు ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కలుగుతుంది.
ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ ప్రసార హక్కులను హాట్‌స్టార్ కలిగి ఉన్న విషయం విదితమే. అయితే ఇటీవలే జియో, హాట్‌స్టార్‌ల మధ్య డీల్ ఉండబోదని, కనుక ఈసారి జియో కస్టమర్లు ఐపీఎల్ మ్యాచ్‌లను జియోటీవీలో చూడలేరని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం.. జియో, హాట్‌స్టార్‌లు చర్చలు జరుపుతున్నాయని, అవి ఓకే అయితే.. జియో కస్టమర్లు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశం కలుగుతుందని తెలుస్తోంది.
అయితే ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు గాను జియో కస్టమర్లు రూ.401 లేదా రూ.2599 ప్లాన్‌లలో ఏదో ఒక ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కేవలం ఈ ప్లాన్లను వాడే కస్టమర్లకే జియో ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను చూసే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. రూ.401 ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. డేటా అయిపోతే 6జీబీ అదనపు డేటాను ఉచితంగా వాడుకోవచ్చు.
రూ.2599 ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అదనంగా మరో 10 జీబీ డేటా వస్తుంది. ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో ఏడాది కాలవ్యవధి గల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో యూజర్లు హాట్ స్టార్ యాప్‌లో ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు. ఇక రూ.401 ప్లాన్ ఉన్నవారు కూడా అదే యాప్‌లో ఉచితంగా మ్యాచ్‌లను చూడవచ్చు. హాట్‌స్టార్ ఖాతా లేని వారు కేవలం 5 నిమిషాలపాటు మాత్రమే ఐపీఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు. ఈ క్రమంలోనే జియో తన కస్టమర్లకు ఈ ఆఫర్‌ను అతి త్వరలో అందివ్వనున్నట్లు తెలిసింది.