ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు బైడెన్ ఈ సాయాన్ని ప్రకటించారు. తీవ్ర ఆహార సంక్షోభంలో చిక్కుకున్న ప్రజలకు ఈ నిధులు సాంత్వన కలిగిస్తాయని అన్నారు. ఉక్రెయిన్‌పై అత్యంత పాశవిక యుద్ధానికి పాల్పడటం ద్వారా.. ఐరాస మూల సిద్ధాంతాలను రష్యా నిస్సిగ్గుగా ఉల్లంఘించిందని బైడెన్ విరుచుకుపడ్డారు.
“ఉక్రెయిన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రష్యా ఏడు నెలలుగా యుద్ధం సాగిస్తూ అక్కడి పౌరులను చిత్రహింసలకు గురిచేస్తోంది. అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగస్వామి అయి కూడా.. అణు దాడుల పేరుతో పుతిన్ బాధ్యతారాహిత్య బెదిరింపులకు దిగుతున్నారు. ఉక్రెయిన్ భూభాగాలను విలీనం చేసుకునేందుకు అక్కడ బూటకపు రెఫరెండం చేపడుతున్నారు. మాస్కో దురాక్రమణను అన్ని దేశాలూ ఖండించాలి” అని బైడెన్ పేర్కొన్నారు.