బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ఏడాది పూర్తయింది. మొత్తం 3 విడతల్లో 1121 కి.మీలు, 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ఘర్షణలు, కేసులతో సాగిన ఈ యాత్ర నేటితో ముగిసింది. అయితే ఈ సందర్భంగా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రూ. 40వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. లక్షా 40వేల కోట్లు ఖర్చు పెట్టారని, మజ్లిస్ భయంతోనే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17న విమోచనం దినోత్సవం నిర్వహించడం లేదని నడ్డా విమర్శించారు జేపీ నడ్డా.
తాము అధికారంలోకి వచ్చాక విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు జేపీ నడ్డా. తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు కూడా పాకిందన్నారు జేపీ నడ్డా. జల్ జీవన్ మిషన్ కింద రూ. 3,098 కోట్లను ప్రకటించామని, తెలంగాణ మాత్రం రూ. 200 కోట్లే తీసుకుందని నడ్డా ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులను కేసీఆర్ సర్కార్ దుర్వినియోగం చేస్తుందన్నారు జేపీ నడ్డా. తెలంగాణలో నయా నిజాం వచ్చారంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు జేపీ నడ్డా.