ఏడేళ్ల క్రితం జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్ కాల్పుల్లో అమరుడైన లాన్స్‌నాయక్ మహమ్మద్ ఫిరోజ్ఖాన్కు ప్రభుత్వం ఎట్టకేలకు పరిహారం చెల్లించింది. అమరజవాను భార్య బ్యాంకు ఖాతాలో గత నెల 31న రూ.29 లక్షలు జమచేసినట్టు హైకోర్టుకు సర్కారు నివేదించింది.
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో 2013లో జరిగిన కాల్పుల్లో లాన్స్‌నాయక్ వీరమరణం పొందారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.29 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించడం లేదని.. ఫిరోజ్‌ఖాన్ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని వివరిస్తూ న్యాయవాది పవన్‌కుమార్ హైకోర్టుకు లేఖ రాశారు. పరిహారం చెల్లింపులో ఎందుకు జాప్యం జరుగుతుందో తెలపాలని జీఏడీ, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు, హైదరాబాద్ కలెక్టర్‌కు గత నెల 27న హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఈ కేసులో ఇవాళ్టి విచారణ సందర్భంగా గత నెల 31న అమరుడి భార్య బ్యాంకు ఖాతాలో రూ.29 లక్షలు జమచేసినట్టు ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. నోటీసులు ఇచ్చిన తర్వాతైనా ప్రభుత్వం స్పందించడం సంతోషకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫిరోజ్‌ఖాన్ భార్య బ్యాంకు ఖాతాకు రూ.29 లక్షల రూపాయలు బదిలీ అయినట్టు ఈనెల 19లోగా ఆధారాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.