అవును! ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయ వర్గాల్లో జోరు చర్చగా నడుస్తోంది. బీజేపీ-జనసేనల కూటమి రాజకీయాల్లో బలి అయ్యేది ఎవరు ? వారి అసలు టార్గెట్ ఏంటి ? అని చర్చించుకుంటున్నప్పుడు ఆసక్తికర విషయం వెలుగు చూస్తోంది. అదే.. వీరి టార్గెట్ జగన్ కాదని, చంద్రబాబేనని అంటున్నారు. వాస్తవానికి గతంలో పవన్-చంద్రబాబుల కూటమి కూడా ప్రతిపక్షంపై దాడి చేసింది. ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీ నేతలను చంద్రబాబు టీడీపీలోకి చేర్చుకోవడంపై నిజాయితీరాజకీయాలు చేస్తానన్న పవన్ మౌనం వహించారు. కనీసం మాట మాత్రం కూడా స్పందించలేదు.
ఇక, ఇప్పుడు పవన్-సోము వీర్రాజుల కూటమి కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీపైనే దాడి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి కూడా ఒక కారణం ఉందని అంటున్నారు. వైఎస్సార్ సీపీ ఓటు బ్యాంకును కదపడం ఇప్పట్లో సాధ్యం కాదు. అదేవిధంగా నేతలను కూడా తీసుకువచ్చి కండువా కప్పడం కూడా వీరివల్ల అయ్యే పనికాదు. ఈ నేపథ్యంలో సోము-పవన్‌ల కు ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీ. అమరావతి ఎఫెక్ట్ సహా పార్టీలో నాయకత్వ లోపాలతో నానాటికీ కునారిల్లుతున్న టీడీపీని విచ్ఛిన్నం చేయగలిగితే.. తమ కూటమికి ఎదురు లేదని వీరు భావిస్తున్నారట.
అంటే.. సోము వీర్రాజు ఇటీవల చెప్పినట్టు పవన్‌కు ఉన్న 19 శాతం ఓటు బ్యాంకు, తమకున్న 7 శాతం ఓటు బ్యాంకుకు మరికొంత కలిపి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. మరి ఈ కలిపే ఓటు బ్యాంకు ఎవరిది ? ఎవరి నుంచి ఓటు బ్యాంకు చీలుతుంది ? అంటే.. అధికార పార్టీ పై ప్రజలకు సానుకూలత ఉంది.
మూడు రాజధానులతో ఈ ఓటు బ్యాంకు మరింత పెరిగినా.. ఆశ్చర్యం లేదు. ఎటొచ్చీ.. చంద్రబాబు అమరావతి విషయంలో దోషిగా మారుతున్నారు. అదే సమయంలో ఆయనపై పార్టీలోనూ పెద్దగా పాజిటివ్ టాక్ లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ఓటు బ్యాంకుతోపాటు.. నేతలను కూడా లాగేసేందుకు అవకాశం ఎక్కువని లెక్క తేల్చారు. త్వరలోనే ఈ ఆపరేషన్ ప్రారంభిస్తారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.