ఏపీ టీడీపీ అధ్యక్షుడి విషయంలో చంద్రబాబు మరోసారి బీసీ అస్త్రం ప్రయోగించనున్నారా ? ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును తప్పించేసి ఆ ప్లేసులో మరో బీసీ నేతను నియమించేందుకు రంగం సిద్ధం అవుతోందా ? అంటే ఏపీ టీడీపీ వర్గాల్లో ఇదే విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా బీసీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నారు. అయితే గత ఐదేళ్లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పూర్తిగా అణగదొక్కారన్న టాక్ బీసీల్లో బలంగా వచ్చేసింది. అందుకే గత ఎన్నికల్లో బీసీల్లో మెజార్టీ వర్గాలు, ప్రజలు జగన్ వైపు మొగ్గు చూపారు.
అందుకే టీడీపీ ఓటు బ్యాంకు ఘోరంగా పడిపోయింది. ఇప్పటకీ కూడా బీసీల్లో బలమైన వర్గాలు జగన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇక ఇప్పుడు బీసీలను తిరిగి తన వైపునకు తిప్పుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. బీసీలు టీడీపీ వైపు రాకపోతే పార్టీకి, తనకు రాజకీయ భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చేశారు. ఇక ఇటీవల ఇద్దరు మాజీ బీసీ మంత్రులు అయిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర జైలుకు వెళ్లడంతో వైఎస్సార్‌సీపీ బీసీలను టార్గెట్ చేస్తోందన్న వాదాన్ని టీడీపీ వాళ్లు జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
ఇక గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవని కళా వెంకటరావు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటే అది పార్టీకి కూడా ఇబ్బందే అని బాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీ నేత అయినా కళా తప్పించి మరో బీసీ నేతకు ఈ పదవి కట్టబెట్టాలని చూస్తున్నారట. వైసీపీ అన్నా, సీఎం జగన్ అన్నా గత కొన్నేళ్లుగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బలంగా విరుచుకుపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే అచ్చెన్నను ఈఎస్ఐ స్కాంలో ఇరికించిన వైసీపీ వాళ్లు అరెస్టు చేశారని టీడీపీ కూడా ఆరోపణలు చేస్తోంది.
అచ్చెన్న అరెస్టయ్యాక వెంటనే బెయిలు తీసుకురాకపోవడంపై కూడా బీసీలు చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడంతో పాటు బలమైన వాయిస్ ఉన్న అచ్చెన్నకు మరింత ప్రయార్టీ ఇచ్చే క్రమంలో అచ్చెన్నకు ఏపీ టీడీపీ పగ్గాలు కట్టబెట్టాలన్న బాబు నిర్ణయానికి టీడీపీ సీనియర్లు కూడా ఓటేశారంటున్నారు. టీడీపీ త్వరలోనే సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయనుంది. ఆ వెంటనే అచ్చెన్నను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు.
-Vuyyuru Subhash