తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాళేశ్వరంతో సాగు పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. అక్కడ నుంచి దశల వారీగా గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. అయితే ఇలాంటి ప్రాజెక్ట్ పైన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ లో ఫిర్యాదు నమోదైంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు ముంపుకు గురవుతున్నాయని ఫిర్యాదు చేశారు.
దీనిపై ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ప్రతీ ఏటా బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టపోతుందని.. దాదాపుగా 30 నుంచి 40 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంటనష్టం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదుతరుపున న్యాయవాది కమీషన్ దృష్టికి తెచ్చారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ.. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
కాగా ప్రతీ ఏడాది వర్షాకాలంలో సరస్వతి, లక్ష్మీ బ్యారేజీలు నిండుతుందడటంతో బ్యారేజీలపై ఉన్న మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. బ్యాక్ వాటర్ పంటల్లోకి చేరుతోంది.