మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప పోరు బరిలో ఉన్న సంగతి అందరికీ విదితమే. బీజేపీ తరఫున ఆయన పోటీలో ఉండగా ఆయన్ను ఓడించేందుకుగాను టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు నేతలను గులాబీ గూటిలో చేర్చుకోవడంతో పాటు ఈటల అనుచరులకు పదవులు ఇస్తున్నది. అయితే, బీజేపీ నేతలకు ఈటల రాజేందర్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలూ ఆరోపిస్తున్నారు. అవేంటంటే..
హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు ఈటల రాజేందర్ మొన్నటి వరకు నియోజకవర్గంలో బాగానే ప్రచారం చేశారు. ‘ప్రజాదీవెన యాత్ర’ పేరిట పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురి కాగా ఆస్పత్రిలో చేరాక డాక్టర్స్ మోకాలికి సర్జరీ చేశారు. అయితే, ఈటల ప్రచారపరంగా బీజేపీ పార్టీ పేరును అంతగా చెప్పడం లేదని టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రచారంలో మోడీ ఫొటోను ఎందుకు పెట్టుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రి హరీశ్ కూడా ఈ ప్రశ్నను సంధించారు. దీంతో కమలనాథులు ఇబ్బందుల్లో పడ్డారని చెప్పొచ్చు. ఈటల కేవలం వ్యక్తిగతంగా తన పేరునే ప్రమోట్ చేసుకుంటున్నారని, పార్టీ పరంగా ఎలాంటి ప్రమోషన్ లేదనే చర్చ ప్రస్తుతం నడుస్తున్నది. మోడీ ఫొటోను చూస్తే ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలు గుర్తొస్తాయని మంత్రి హరీశ్ విమర్శించగా,మోడీ ఫొటో పెట్టుకుంటే ఈటల ఓటమి ఖాయమని కాంగ్రెస్ పార్టీ నేతలూ ఆరోపిస్తున్నారు. అయితే, కమలనాథులు ఈ విషయమై ఎలా స్పందిస్తారు? అనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.