కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయ్యాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కన్నడనాట ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు బీజేపీ నుంచి అమిత్ షా, జేపీ నడ్డా, యోగీ ఆదిత్యనాథ్ వంటి అగ్రనేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే కన్నడనాట ప్రచారం నిర్వహించారు. అయితే ఈసారి ఎలాగైనా కన్నడకస్తూరి కమలానికే దక్కాలని ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగనున్నారు.
మోదీ కర్ణాటకలో ఆర్రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. కీలక నియోజకవర్గాల్లో కనీసం 22 ర్యాలీలు నిర్వహించేందుకు కాషాయదళం షెడ్యూల్ ఖరారు చేసింది. రేపట్నుంచే మోదీ పర్యటన షురూ కానుంది. ఈ నెల 29న ప్రత్యేక విమానంలో కర్ణాటక చేరుకోనున్న ప్రధాని మోదీ.. హుమ్నాబాద్, విజయపుర, కుడాచి, బెంగళూరు ఉత్తరం నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 30న కోలార్, చెన్నపట్న, బెలూర్ స్థానాల పరిధిలో రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. అనంతరం మోదీ దిల్లీకి వెళ్లి తిరిగి వెళ్తారు.
మే 2న నరేంద్ర మోదీ మళ్లీ కర్ణాటకకు వస్తారు. అదే రోజు చిత్రదుర్గ, విజయనగర, సింధనూర్, కలబురిగి నియోజకవర్గ ప్రాంతాల్లోనూ, మే 3న మూడాబిడ్రి, కవార్, కిట్టూర్ పరిధిలో భారీ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది. రెండు రోజుల విరామం అనంతరం మళ్లీ మే 6న మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తొలిరోజు చిత్తాపుర్, తుమకూరు గ్రామీణం, బెంగళూరు దక్షిణ నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారం ముగిసే మే 7న మోదీ నాలుగు ర్యాలీల్లో పాల్గొనేలా స్థానిక నేతలు షెడ్యూల్ ఖరారు చేసినట్లు సమాచారం.