గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ ప్రతినిధుల సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో దళిత బంధు కార్యక్రమం అమలులో అక్రమాలు చోటు చేసుకోవడం పై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు, అలాగే ఎమ్మెల్యేలపై సీరియస్ అయినట్లు ఓ వార్త వైరల్ గా మారింది.
దళిత బంధు పథకం విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడ్డారని, మూడు లక్షల వరకు వసూలు చేశారని, ఆ చిట్టా తన వద్ద ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. నేడు హుజరాబాద్ పర్యటనలో భాగంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కెసిఆర్ కి చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకంలో మూడు లక్షల రూపాయలు తిన్న ఎమ్మెల్యేలను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
స్వయంగా ముఖ్యమంత్రే ఎమ్మెల్యేలు వారి అనుచరులు దళిత బందులో చేతివాటం చూపారని అన్నారు అంటే ఇందులో ఏ మేరకు అవినీతి జరిగిందో అర్థం అవుతుందన్నారు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మద్యం మాఫియా లాగా.. ఇప్పుడు దళిత బంధు అవినీతికి అడ్డాగా మారిందని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈటెల.