తెలంగాణలో వర్షాలు, వరదల వలన ఇబ్బందులు పడుతోన్న వారికి కేసీఆర్ ఊరటనిచ్చేలా గుడ్ న్యూస్ చెప్పారు. భారీ వర్షాలకు మృతిచెందిన కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. అలానే హైదరాబాద్ లో వరద సహాయ కార్యక్రమాలకు రూ.5 కోట్లు నిధులు కూడా ఆయన విడుదల చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి పూర్తిగా కొత్త ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ ప్రకటించారు.
అలానే ముంపునకు గురైన ప్రజలకు బియ్యం, పప్పు, నిత్యావసరాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అలానే ఒక్కో ఇంటికీ మూడు దుప్పట్లు కూడా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల 50 మంది మృతి చెందారని, ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 11 మంది మృతి చెందారని ఆయన పేర్కొన్నారు. 1916 తర్వాత హైదరాబాద్‌లో ఒకేరోజు 31 సెంమీ వర్షపాతం నమోదయిందని, ఒక్క హైదరాబాద్ లోనే నీటిలో మునిగిన ఇళ్ళు దాదాపు 20,540 ఉంటాయని పేర్కొన్న కేసీఆర్ యుద్ధప్రాతిపదికన సహాయక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.