ఏళ్ల తరబడి పోరాటం అనంతరం సాధించుకున్న తెలంగాణలో తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ…. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, తెదేపా ఒకవైపు.. 15 ఏళ్లు పోరాటం సాగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన తెరాస మరోవైపు ఉన్నాయన్నారు. నాలుగున్నరేళ్లలో తెరాస అందించిన పాలన ఎలా ఉంది అనే విషయాన్ని ప్రజలు డిసెంబర్ 7 న ఓటు రూపంలో తెలియజేయాలన్నారు. చిమ్మచీకట్లు కమ్ముకుంటాయన్న ఆంధ్ర నాయకులకు తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా వారికి కళ్లకు కనపడటం లేదా అంటూ వ్యాఖ్యానించారు.
విద్యుత్ సరఫరాపై నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని కేసీఆర్ మండిపడ్డారు. 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపా.. ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందా? అని ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్‌లో నీళ్లు లేక బీడుగా ఉన్న భూములను చూసి ఒకప్పుడు బాధపడ్డామని.. ఇప్పుడు వట్టెం ప్రాజెక్టుతో సాగునీటి కష్టాలు తీరుతున్నాయన్నారు. తెరాస పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు.