మహిళా సంఘాలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు క్యూ ఆర్ కోడ్ తో ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని సిఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని వారిని గుర్తించి, నూతన బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
తాజాగా బి ఆర్ కె భవన్ లో స్వయం సహాయక సంఘాల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల గ్రూపులు, సభ్యుల వివరాలను అప్డేట్ చేయాలని చెప్పారు. బ్యాంకులు ఇస్తున్న వడ్డీ లేని రుణాలను ఉత్పాదక రంగాల్లో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 6,06,000 స్వయం సహాయక బృందాల్లో 64 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు.