కాంగ్రెస్ కస్సుబుస్సులాడినా, బీజేపీ కయ్యానికి కాలు దువ్వినా తెలంగాణలో గెలిచే పార్టీ తమదేనని కేసీఆర్ ధీమాగానే ఉన్నారు.ఇదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ లక్ష్యాలను చేరుకుంది కనుక తాను దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తానని అంటున్నారు. అందుకే నిన్నటి వేళ రాజ్యాంగంకు సంబంధించి,దేశ సమగ్ర అభివృద్ధికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారని గులాబీ శ్రేణులు అంటున్నాయి. రానున్న కాలంలో రాజ్యాంగంలో అవసరమైన మార్పులు టీఆర్ఎస్ పట్టుబడుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వివాదాలకు అనుగుణంగా మార్చుకునేందుకు విపక్షం ప్రయత్నిస్తోంది అన్నది టీఆర్ఎస్ వాదన.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. రాజ్యాంగం మార్చాల్సిందేనని చేసిన వ్యాఖ్యతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తమదైన వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ వ్యాఖ్యలు సరిగా అర్థం చేసుకోకుండా ఆయనపై కోపం కావడం తగదని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులకు సంబంధించి చేస్తున్నదేమీ లేదన్న వాదనలోభాగంగానే కొన్ని మార్పులు రాజ్యాంగంలో చేయాల్సిన సమయం వచ్చేసిందన్న అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నారని గులాబీ శ్రేణులు అంటున్నాయి.
బీజేపీ కూడా మామూలుగా కాదు ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది. రాజ్యాంగం జోలికి వస్తే ఊరుకోం అని బండి సంజయ్ ఇప్పటికే వార్నింగ్ లు ఇచ్చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు. విపక్షాలు ఎవరికి వారే కేసీఆర్ పై కోపం అవుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాల్లో కాలు పెట్టి మంచి గా ఎదగాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే భావ సారూప్యత కోసం వెతుకులాడుతున్నారు. త్వరలోనే రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్ లతో ఓ సమావేశం ఏర్పాటు చేసి తక్షణ కార్యాచరణ రూపొందించాలని అనుకుంటున్నారు.
సంకుచిత ఆలోచనలు తనవి కావని ఈ దేశం భవిష్యత్ కోసమే ఆలోచిస్తున్నానని కేసీఆర్ అంటున్నారు. జాతీయ పార్టీలు నాయకులు ఎంతగా తనపై ఆగ్రహావేశాలతో ఊగిపోయినా కూడా ఆయన మాత్రం తనదైన పంథాలోనే మాట్లాడుతున్నారు. మాట్లాడాలని అనుకుంటున్నారు కూడా! దేశ రాజకీయాల్లో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెడతానని అనుకోలేదని కానీ స్థాపించి అనూహ్య విజయాలు సాధించామని, ఇప్పుడు కూడా అంతేనని తాను దేశ రాజకీయాల్లో పదవుల కోసం ఎదగాలని అనుకోవడంలేదు అని, రానున్నకాలంలో దేశం అభ్యున్నతి కోసం పాటు పడతానని అంటున్నారు.